అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్.
అనకాపల్లి, నవంబర్ 18:
అనకాపల్లి జిల్లాలో నేటి నుండి రెండవ విడత గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయి, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని 8 మండలాల్లో జరుగుతున్న ఈ రెండవ విడత ఎన్నికల భద్రతా ఏర్పాట్ల వివరాలను ఎస్పీ గారు వెల్లడించారు:
మొత్తం మండలాలు: 8
గ్రామ పంచాయతీలు: 213 (వార్డు మెంబర్లు: 2,072)
పోలింగ్ లొకేషన్లు: 452 (పోలింగ్ స్టేషన్లు: 2,092)
సమస్యాత్మక ప్రాంతాలు: అత్యంత సమస్యాత్మక (హైపర్ సెన్సిటివ్) కేంద్రాలు - 104, సమస్యాత్మక (సెన్సిటివ్) కేంద్రాలు - 123
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు పోలీస్ అధికారులకు మరియు ప్రజలకు జారీ చేసిన కీలక ఆదేశాలు:
అధికారుల నిరంతర పర్యవేక్షణ: నేటి నుండి రెండవ విడత నామినేషన్లు జరుగుతున్న మొత్తం 8 మండలాలలోని నామినేషన్ కేంద్రాల వద్ద పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
100 మీటర్ల నిబంధన అమలు: నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి నిబంధనను (100-metre line) కఠినంగా అమలు చేయాలి. అనుమతి లేని వ్యక్తులను ఆ పరిధిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు.
గుంపులు గుమికూడటంపై నిషేధం: నామినేషన్ కేంద్రాల సమీపంలో ప్రజలు గుంపులుగా గుమికూడటం, ఊరేగింపులు నిర్వహించడం వంటి వాటికి అనుమతి లేదు. ట్రాఫిక్కు లేదా సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి.
శాంతిభద్రతల పరిరక్షణ: ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు గానీ, శాంతిభద్రతల సమస్యలు గానీ తలెత్తకుండా పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC): రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మరియు ప్రజలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటిస్తూ, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.