రానున్న వినాయక చవితి సందర్భంగా ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా డీజే సౌండ్ సిస్టమ్ బాక్సులు మరియు సౌండ్ ఆపరేటర్ల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. రామకృష్ణ మరియు ఎస్.ఐ. శ్రీ సుధాకర్ గారు తమ సిబ్బందితో కలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో డీజే సౌండ్స్ వల్ల ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు మరియు రోగులకు కలుగుతున్న అనర్థాలు, ఇబ్బందికర పరిస్థితులపై చర్చించారు. రాత్రి సమయాల్లో అధిక శబ్దంతో మోగే డీజేల వల్ల జరిగే నష్టాలను వివరించి, ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు
సుప్రీంకోర్టు మరియు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం డీజే బాక్సులు మరియు మైకుల ద్వారా అనుమతించబడిన డెసిబెల్స్ మించి శబ్దం చేయరాదు.
రాత్రి సమయాల్లో నిషేధం: రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు, డీజేల వినియోగంపై పూర్తి నిషేధం ఉంటుంది.
విద్యార్థులు మరియు రోగుల ఇబ్బందులు: అధిక శబ్దం వల్ల పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, వృద్ధులు మరియు ఆసుపత్రులలో చికిత్స పొందే రోగులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని గుర్తించడం.
ఏదైనా వేడుకలు, శుభకార్యాలు లేదా ఊరేగింపుల్లో సౌండ్ సిస్టమ్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల నుండి ముందస్తు అనుమతి పొందడం విధిగా పాటించాలి.
నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని భారీ డీజే సౌండ్ బాక్సులు, యాంప్లిఫైయర్లు మరియు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది.
నిర్వాహకులపై చట్టపరమైన కేసులు: నిబంధనలను ఉల్లంఘించి పదే పదే శబ్ద కాలుష్యానికి పాల్పడే డీజే నిర్వాహకులు మరియు సౌండ్ బాక్సుల యజమానులపై చట్టపరంగా కఠినమైన కేసులు నమోదు చేస్తారు.
యువతను పెడదోవ పట్టించే డీజే హోరుకు దూరంగా ఉంటూ, సంప్రదాయ వాయిద్యాలను లేదా మితమైన శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్స్‌ను ప్రోత్సహించడం.
రాత్రి సమయాల్లో నిబంధనలు ఉల్లంఘించి ఎక్కడైనా డీజేలు మోగిస్తే తక్షణమే స్పందించేలా ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించడం.
డీజేల మోత వల్ల ఇబ్బంది కలుగుతుందని డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు ప్రజల నుండి ఫిర్యాదు అందగానే తక్షణం చర్యలు తీసుకోవడం.
సహకారమే లక్ష్యం: సౌండ్ సిస్టమ్ నిర్వాహకులు చట్టాన్ని గౌరవిస్తూ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖతో సత్సంబంధాలు కలిగి ఉండాలని విజ్ఞప్తి చేసిన ఏలూరు 1 టౌన్ పోలీసులు.
సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల ఆరోగ్యానికి హాని చేసేలా ఎవరు వ్యవహరించినా పోలీస్ శాఖ ఉదాసీనంగా ఉండదని, నిర్వాహకులు అందరూ స్వచ్ఛందంగా నిబంధనలు సహకరించాలని ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ విజ్ఞప్తి చేశారు