అచ్యుతాపురం, నవంబర్ 14: అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు లబ్ధిదారుల నుంచి వచ్చే అభిప్రాయాలను కీలకంగా పరిగణించాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యలక్ష్మి సూచించారు. ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) కాల్స్ ద్వారా నమోదవుతున్న స్పందనలను ఎప్పటికప్పుడు పరిశీలించి, క్షేత్రస్థాయిలో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని సిబ్బందికి స్పష్టం చేశారు.ఈ మేరకు శనివారం అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలోని ఒకటి, రెండు అంగన్‌వాడీ కేంద్రాలను ఆమె సందర్శించారు. కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న పూర్వ ప్రాథమిక విద్య, గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేస్తున్న పోషకాహారం, ఇతర సంక్షేమ సేవల అమలుతీరును పరిశీలించారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలను గుర్తించే ఈసీడీ స్క్రీనింగ్‌ను నిర్ణీత విధంగా చేపట్టాలని సూచించారు. ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవై) పథకానికి అర్హులైన మహిళలకు దాని ప్రయోజనాలను వివరించి, పథకం అందేలా చూడాలన్నారు. చిన్నారుల ఆరోగ్యం, పోషణకు సంబంధించి నిర్దేశించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. సీడీపీవో కె. ఇందిరాదేవి, ఏసీడీపీవో పి.వి. రమణకుమారి, అనకాపల్లి సీడీపీవో, సూపర్‌వైజర్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.