మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం ,ఏఐటియుసి

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం ,ఏఐటియుసి

25/June/2026 07:23    Share:   

#ఒప్పంద కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలి :
#ఏలూరు జిల్లా ఏఐటియుసి అధ్యక్షులు తోర్లపాటి బాబు :
#ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు :
#ఏలూరు జిల్లా ఏఐటియుసి నాయకులు అప్పలరాజు హెచ్చరిక
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 
మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ఏలూరు జిల్లా ఏఐటియుసి అధ్యక్షులు తోర్లపాటి బాబు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్, ఏలూరు జిల్లా ఏఐటియుసి నాయకులు ఏ.అప్పలరాజు హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేసే వేలాది మంది ఒప్పంద, ఆప్కాస్ కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల కార్మికులకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముందుగా కార్మికులందరూ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు తొర్లపాటి బాబు, భజంత్రీ శ్రీనివాస్, అప్పలరాజులు మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో  ఇంజనీరింగ్ విభాగం సేవలను థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లకు అప్పగించే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేసారు. అదేవిధంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు మేరకు ఒప్పంద  కార్మికులను శాశ్వత ప్రాతిపదికన మున్సిపాలిటీలో నియమించాలన్నారు. ఈ డిమాండ్లు నెరవేరే వరకు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారి ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. మున్సిపల్ శాశ్వత కార్మికులు, ఆప్కాస్, పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ విభాగ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తుందని విమర్శించారు. ప్రతిరోజు ఉదయాన్నే తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా నగర వీధులను, డ్రైనేజీలను పరిశుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి బట్టబయలు అవుతుందని ఎద్దేవా చేశారు. మున్సిపాలిటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్ విభాగ సేవలను దర్ద్ పార్టీ కాంట్రాక్టర్లకు అప్పగించి కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేయాలని చూస్తుందని దుయ్యబట్టారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబీకులకు ఉద్యోగ అవకాశం కల్పించడంతో పాటు పదవీ విరమణ పొందిన కార్మికుల పిల్లలకు సైతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు సకాలంలో అందాల్సిన రాయితీలు, సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మున్సిపాలిటీల విస్తీర్ణం మేరకు కార్మికులపై అదనపు పని భారం పడకుండా ఉండేందుకు
అదనపు సిబ్బంది నియమించాలన్నారు. గ్రాడ్యుటి చట్టం మేరకు కార్మికులందరికీ గ్రాడ్యూటీని అమలు చేసి, పిఆర్సిని నియమించి 30% మద్యంతర భృతి ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా శాశ్వత  కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం వెంటనే చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కోర్టు తీర్పులను అనుసరించి చెల్లించాలి జీ.వో ఏం ఎస్ 25 ప్రకారం మరణించిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన స్లీపింగ్ మిషన్ ద్వారా పని ఎటువంటి ప్రయోజనం లేదని, అందువల్ల ఆ స్థానంలో కార్మికులను నియమించి పనులు చేయించాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగ కార్మికుల పదవి విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. ఈ సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ దసల వారి ఆందోళనలో జూలై 7న జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని కార్మికులందరూ జయప్రదం చేయాలని బాబు, శ్రీనివాస్, అప్పలరాజులు పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దొడ్డికర్ల నాగబాబు, యూనియన్ అధ్యక్షులు బంగారు అక్కమ్మ, కోశాధికారి ఇంటి అశోక్, పేడారి వంశి జానకిరామ్, ఇంజనీర్ సెక్షన్ కోశాధికారి బి.నారాయణరావు, అధ్యక్షులు బి.నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఎస్. శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బి. వెంకటేశ్వరరావు, ఏలూరు ఏరియా సిపిఐ సహాయ కార్యదర్శులు కూరెళ్ళ వరప్రసాద్, స్వాతి, గోవాడ మల్లేశ్వరరావు, ప్రసాద్, దాసు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter