
యలమంచిలి :
సీఐటీయూ అఖిలభారత పిలుపులో భాగంగా డిసెంబర్ 1న జరగనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా యలమంచిలిలో సోమవారం చలో ఢిల్లీ గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకర్రావు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గడిచినా కార్మికుల సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. కార్మికులకు నష్టం కలిగించి, యజమానులకు లాభాలు చేకూర్చే నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చారని ఆరోపించారు.గత 12 ఏళ్లుగా స్కీముల్లో పనిచేస్తున్న అంగన్ వాడీ, ఆశా, వీఓఏ, స్కూలు ఆయా, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాలు పెంచలేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుంటే, వేతనాలు పెరగక కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు 15 సంవత్సరాలుగా వేతనాల జీవో సవరణ చేయలేదని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేశారని అన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది ఖాళీలు భర్తీ చేయకపోవడంతో యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని అన్నారు.అసంఘటిత రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణ, ముఠా, ఆటో, మోటార్ కార్మికులకు ఎటువంటి రక్షణ లేకుండా పోయిందన్నారు. దేశ సంపద అయిన భూమి, అడవి, నీటిని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి వారికి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రక్షణ కల్పిస్తున్నామని చెబుతోందని, మరి అందులో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ ఏదని సీఐటీయూ ప్రశ్నిస్తోందన్నారు. విశాఖపట్నంలో రెండు రోజులపాటు జరిగిన సీఐఐ సదస్సులో కార్పొరేట్ కంపెనీలకు ఎర్రతివాచీ పరిచారని, భూములను కారుచౌకగా కట్టబెడుతూ వేల కోట్ల రాయితీలు ఇస్తున్నారని, అందులో పనిచేసే కార్మికుల వేతనాలు మాత్రం పెంచడం లేదని విమర్శించారు.కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1 నుంచి జరిగే చలో ఢిల్లీ కార్యక్రమంలో కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు శశికళ, శివశ్రీ, నాగిని తదితరులు పాల్గొన్నారు.