కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
వినాయకచవితి ఉత్సవాల సమయంలో జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వినాయకచవితి ఉత్సవాల సమయంలో ముందస్తు జాగ్రత్త చర్యలు, ఎన్నికలు, ఎస్ఐఆర్, కొత్త సామాజిక పెన్షన్ దరఖాస్తులు, తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ కార్యాలయం నుండి శుక్రవారం సంబంధిత శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓ లతో జేసీ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ మట్టి వినాయకులను భక్తిశ్రద్ధలతో పూజించి పర్యావరణానికి మేలు కలిగేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వినాయకచవితి ఉత్సవాల సమయంలో, నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. మండల, గ్రామ స్థాయిలలో కమిటీలను ఏర్పాటుచేసి, వినాయకచవితి ఉత్సవాల సమయంలో బాణాసంచా, విద్యుద్ఘాతం వంటి ప్రమాదాలు జరగకుండా, నిమజ్జన సమయంలో ముఖ్యంగా ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతి లేకుండా బాణాసంచా అనధికార నిల్వలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ఒకేరోజు ఎక్కువ సంఖ్యలో నిమజ్జనాలు జరగకుండా చూడాలన్నారు. బెల్ట్ షాపుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో కొత్తగా సామజిక పెన్షన్ల కోసం 16 వేల 316 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారి దరఖాస్తులను పరిశీలించి ఎంపిడిఓ లాగిన్ కి పంపాలన్నారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితాలో సవరణలు, అభ్యంతరాలపై అందిన దరఖాస్తులు నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలన్నారు. ఓటర్ల తుది జాబితా పేర్లను పరిశీలించి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల లాగిన్ కి పంపాలని జేసీ ఆదేశించారు. ఈనెల 12వ తేదీన జిల్లాలో నిర్వహించే ప్రత్యేక జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొనే అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఇంచార్జ్ డిఆర్ఓ ఎం. ముక్కంటి, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ లు లక్ష్మి ప్రసన్న, రమణ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, ఏఈఆర్ఓ, తహసీల్దార్లు, ఎంపిడిఓ లు, రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.