విద్యుత్ సిబ్బందికి సెలవులు రద్దు.. ప్రత్యేక బృందాలు సిద్ధం
అనకాపల్లి: ఆక్వాన్ తుఫాన్ ప్రభావంతో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. తుఫాన్ కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడైనా అంతరాయాలు ఏర్పడితే తక్షణమే పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు.తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 17, 18 తేదీల్లో విద్యుత్ లైన్లపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, వాలిన విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు చేపట్టాలని APCPDCL సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశించారు. ప్రతి సబ్ డివిజన్ పరిధిలో అవసరమైన విద్యుత్ స్తంభాలు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచాలని సూచించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు విద్యుత్ శాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.విద్యుత్ సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేందుకు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. వినియోగదారులు విద్యుత్ అంతరాయాలు, ఇతర సమస్యలపై 1912, 1800 425 155333 టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల కోసం మన మిత్ర 91333 31912 నంబర్‌ను వినియోగించుకోవాలని సూచించారు.తుఫాన్ సమయంలో ప్రజలు విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని, తెగిపడిన విద్యుత్ తీగలను తాకకుండా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ శ్రీనివాసరావు అప్పికొండ