రూ.2 నుంచి 3 లక్షల విలువైన మోటార్లు, విగ్రహాల తయారీ మిషనరి , ఇతర సామగ్రి అపహరణ..!!
షాప్ వెనుక ద్వారం నుంచి చొరబడి వాహనంలో తరలింపు.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు..!!!
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ (స్పెషల్ రిపోర్టర్ ) :
అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో దొంగలు బరితెగిస్తున్నారు. యలమంచిలి నుంచి సైతారుపేట వెళ్లే ప్రధాన రహదారిలో పెంజెరువు ఎదురుగా ఉన్న విగ్రహాల తయారీ షెడ్ షాపులో భారీ చోరీ చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు షాప్ వెనుక వైపు ఉన్న ద్వారం నుంచి లోపలికి చొరబడి సుమారు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల విలువైన మోటార్లు, విగ్రహాల తయారీకి ఉపయోగించే అచ్చులు, క్యాష్ టేబుల్‌తో పాటు పలు విలువైన వస్తువులను అపహరించినట్లు బాధితుడు డి. లోవరాజు తెలిపారు.తన జీవనాధారమైన విగ్రహాల తయారీ వ్యాపారానికి సంబంధించిన విలువైన సామగ్రి మొత్తం చోరీకి గురికావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలు షాప్ వెనుక ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించి, అక్కడ ఉన్న వస్తువులను ఒక వ్యాన్‌లో వేసుకుని తీసుకెళ్లినట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, ప్రతిరోజూ ఈ రహదారి పరిసరాల్లో గంజాయి సేవించే వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు, మద్యం సేవించిన వ్యక్తులు సంచరిస్తుంటారని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను, తన తల్లి పలుమార్లు వారిని మందలించగా, తమ అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు.
వారి బెదిరింపులతో తమకు ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందేమోనన్న భయంతో ఇంతకాలం మౌనంగా ఉన్నామని, ఇప్పుడు తన జీవనాధారమైన షాప్‌లోనే భారీ చోరీ జరగడంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు..ఈ ఘటనపై బాధితుడు డి. లోవరాజు యలమంచిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన షాప్‌లో చోరీకి గురైన వస్తువులను గుర్తించి తిరిగి ఇప్పించడంతో పాటు, ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే పెంజెరువు సమీపంలోని రహదారి పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి, రాత్రి వేళల్లో పోలీసుల నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
ఒక చిన్న వ్యాపారిపై జరిగిన ఈ చోరీతో ఆయన కుటుంబ జీవనాధారమే ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని కోరుతున్నారు.