గంజాయి అక్రమ రవాణాదారుడిపై పీఐటీ ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ ..

గంజాయి అక్రమ రవాణాదారుడిపై పీఐటీ ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ ..

11/November/2026 20:24    Share:   

(PIT NDPS Act) కింద నిర్బంధ ఉత్తర్వులు - విశాఖ సెంట్రల్ జైలుకు తరలింపు

అనకాపల్లి / చోడవరం, నవంబర్ 11: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి సిఫార్సుల మేరకు, మరియు అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ పి.వి.వి. నరసింహారావు గారి పర్యవేక్షణలో చోడవరం సీఐ శ్రీ పి.అప్పలరాజు, ఎన్.డి.పి.ఎస్ (NDPS) సెల్ రమేష్ గార్ల ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న పాత నేరస్తుడిపై పీఐటీ ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ (PIT NDPS Act, 1988) ప్రయోగించి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది.

నిందితుడి వివరాలు: 
జయవరపు కిరణ్ సాయి (21 సంవత్సరాలు), తండ్రి: మాణిక్యాల రావు, నివాసం: డోర్ నెం. 3-3-6, సిటిజన్ కాలనీ, గాంధీగ్రామం, చోడవరం మండలం, అనకాపల్లి జిల్లా.

కేసుల పూర్వాపరాలు: 
నిందితుడు జయవరపు కిరణ్ సాయి తన అనుచరులతో కలిసి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం మరియు ఒడిశా నుండి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి, అనకాపల్లి మరియు పరిసర ప్రాంతాలలో నిల్వ చేస్తూ, విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నాడు. ఇతనిపై నమోదైన ప్రధాన కేసుల వివరాలు:
ఎ.కోడూరు పోలీస్ స్టేషన్ (Cr.No. 14/2026): 26.01.2026న ఆనందపురం గ్రామం శివారులో 8 కిలోల గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డాడు.
చీడికాడ పోలీస్ స్టేషన్ (Cr.No. 117/2024): 08.10.2024న వరాహపురం జంక్షన్ వద్ద 15 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు చిక్కాడు.
దువ్వాడ పోలీస్ స్టేషన్ (Cr.No. 244/2024): ఎన్.డి.పి.ఎస్ చట్టం సెక్షన్ 27(A) కింద నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో కోర్టు రూ.10,000/- జరిమానా విధించింది.

ఎన్ని కేసులు నమోదైనప్పటికీ నిందితుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, గంజాయి అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు చోడవరం సీఐ సమర్పించిన నివేదిక ఆధారంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనిని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (రెవెన్యూ-ఎక్సైజ్ శాఖ) G.O.Rt.No.1954 (తేదీ: 09.11.2026) ద్వారా పీఐటీ ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ 1988, సెక్షన్ 3(1) కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వుల మేరకు చోడవరం సీఐ పి.అప్పలరాజు మరియు ఎన్.డి.పి.ఎస్ సెల్ సీఐ రమేష్ గార్ల బృందం నిందితుడు జయవరపు కిరణ్ సాయిని అదుపులోకి తీసుకుని, విశాఖపట్నం సెంట్రల్ జైలులో నిర్బంధించారు. జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై ఇలాగే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. 
Breaking News

Subscribe our Newsletter