ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్
అనకాపల్లి, నవంబర్ 11:
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో భారత తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. 1888 నవంబర్ 11న జన్మించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త, రచయిత మరియు పాత్రికేయుడని కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడంతో పాటు, దేశ ఐక్యత, సమగ్రత, మత సామరస్యం కోసం ఆయన అవిరళ కృషి చేశారని తెలిపారు.స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన, దేశ విద్యావ్యవస్థకు బలమైన పునాదులు వేశారని ఎస్పీ గారు పేర్కొన్నారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల అభివృద్ధి, సాంకేతిక విద్యా విస్తరణలో ఆయన పోషించిన కీలక పాత్ర మరువలేనిదని గుర్తుచేశారు. విద్యారంగానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినాన్ని దేశవ్యాప్తంగా 'జాతీయ విద్యా దినోత్సవం'గా జరుపుకోవడం గర్వకారణమన్నారు. ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం 1992లో మరణానంతరం అత్యున్నత 'భారతరత్న' పురస్కారంతో గౌరవించిందని, ఆయన దేశభక్తి, విద్యా దృక్పథం మరియు జాతీయ సమైక్యతా భావం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఉద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు, డీఎస్పీలు శ్రీ వి.బాబ్జి రావు, శ్రీ డి.శ్రీహరి రాజు, సీఐలు బాల సూర్యరావు, లక్ష్మి, సతీష్ కుమార్, సురేష్, రమణయ్య, ఎస్సైలు ప్రసాద్, సురేష్ బాబు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.