రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ.. సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ - ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు
విజనగరం జిల్లా ప్రతినిది మందపాటి సూర్యనారాయణ రాజు
చీపురుపల్లి, నవంబర్:
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తెలిపారు. మంగళవారం చీపురుపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ధాన్యం సేకరణకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు.
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధిస్తామని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తలెత్తిన చిన్నపాటి లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగుతున్నామని తెలిపారు.
పార్టీ రహితంగా జరగనున్న ఈ ఎన్నికల్లో కూడా స్థానికంగా ఉన్న పరిస్థితులు, అవకాశాలను బట్టి కూటమిలోని ఇతర పార్టీలకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. పార్టీలకతీతంగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు స్థానిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం, ప్రజల్లో ఉన్న ఆదరణ వంటి అంశాలు ఎక్కువగా ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
పార్టీలో జరిగిన చర్చల అనంతరం గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపికకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.
జిల్లాలో ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్‌తో పాటు సివిల్ సప్లై అధికారులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడంతో పాటు, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత చెల్లింపుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి లేకుండా సకాలంలో నగదు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.
అలాగే గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా సొసైటీలు, ఉత్పత్తిదారుల సంఘాలు, వెలుగు సంఘాలకు అవసరమైన వెసులుబాటు కల్పిస్తామని వెల్లడించారు. ధాన్యం సేకరణలో రైతులకు మరింత సౌకర్యవంతమైన విధానాన్ని అమలు చేసేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తారని పేర్కొన్నారు.
రైతుల పంటకు గిట్టుబాటు ధర, సకాలంలో ధాన్యం కొనుగోలు, వేగవంతమైన చెల్లింపులు అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. రైతుల బాగోగులు, వ్యవసాయ రంగ అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత నాయకులు పాల్గొన్నారు.