భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి భారీగా తరలిరావాలని పిలుపు
క్రైమ్ అనాల్సిస్ |
టివియస్ ప్రకాష్ :
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అధ్యక్షతన ఆయన క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులతో ఈ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, కార్యక్రమ పరిశీలకులు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందం, బీజేపీ నాయకులు రాజాన సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరవడం ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో గర్వకారణమని తెలిపారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎలమంచిలి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజల రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లపై సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు.
నాయకులు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రధానమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కోరారు.
ఈ సమావేశంలో కూటమి నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.