ఉపాధి హామీ కూలీలకు సమాచార హక్కు,చట్టాలపై అవగాహన సదస్సు..

ఉపాధి హామీ కూలీలకు సమాచార హక్కు,చట్టాలపై అవగాహన సదస్సు..

07/November/2026 19:02    Share:   

కార్మిక మహిళలకు చట్టాలపై వివరిస్తున్న ఉద్యమకర్త జగ్గఅప్పారావు
మునగపాక పట్టణాలకే కాకుండా మారుమూల కొండ ప్రాంతాల్లో నివసించే సామాన్య ప్రజలకు సైతం చట్టాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మునగపాక మండలం తోటాడ కొండ ప్రాంతంలో ఉపాధి హామీ కూలీలకు సమాచార హక్కు చట్టం, వినియోగదారుల హక్కుల చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజికవేత్త, సమాచార హక్కు చట్టం ఉద్యమకర్త బొడ్డేడ జగ్గఅప్పారావు కూలీలకు రెండు చట్టాల ప్రాముఖ్యతను వివరించారు. సమాచార హక్కు చట్టం–2005 ద్వారా ప్రభుత్వ శాఖల నుంచి ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఎలా పొందవచ్చో తెలియజేశారు. ఉపాధి హామీ పనులు, కూలీల హాజరు, మస్టర్ రోల్స్, వేతనాల చెల్లింపులు, ప్రభుత్వ నిధుల వినియోగం వంటి వివరాలను తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉందని వివరించారు. అదేవిధంగా వినియోగదారుల రక్షణ చట్టం ద్వారా కొనుగోలు చేసే వస్తువులు, సేవల్లో నాణ్యత, ధరలు, మోసాలు, తూకాల్లో తేడాలు, కల్తీ వంటి సమస్యలపై వినియోగదారులకు ఉన్న హక్కులను వివరించారు. నష్టపోయినప్పుడు ఫిర్యాదు చేసే విధానం, వినియోగదారుల కమిషన్ల ద్వారా న్యాయం పొందే అవకాశాలను తెలియజేశారు. కొండ కోనల్లో నివసించే పేద ప్రజలకు సైతం చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం! సుమారు 30 సంవత్సరాలుగా వినియోగదారుల హక్కులు, సమాచార హక్కు, పర్యావరణ పరిరక్షణ తదితర ఓటుకు  నోటును తిరస్కరించాలని విస్తృత ప్రచారం సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కృషి చేస్తున్న బొడ్డేడ జగ్గఅప్పారావు, ప్రతి ఒక్కరూ తమ హక్కులను తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే చట్టాలను వారి ముంగిటకే తీసుకెళ్లడం ద్వారా అవగాహనతో కూడిన నవ సమాజ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటాడ కొండ ప్రాంతానికి చెందిన మహిళలు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter