కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: ప్రగడ నాగేశ్వరరావు..!
24/October/2026 18:38
Share:
CA న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ఎలమంచిలి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల మధ్య సమన్వయం, పొత్తు ధర్మం అమలుపై దిశానిర్దేశం చేసేందుకు టీడీపీ ముఖ్య సమావేశం నిర్వహించారు. శనివారం అచ్యుతాపురంలోని వేదిక ఫంక్షన్ హాల్‌లో ఏపీఆర్‌డీసీ చైర్మన్, టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, మాజీ జడ్పీ చైర్మన్ లాలం భవానీ భాస్కర్ పాల్గొన్నారు.రాంబిల్లి, ఎలమంచిలి, అచ్యుతాపురం, మునగపాక మండలాల్లో నామినేషన్లు దాఖలు చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులకు పార్టీ నిర్ణయాలను వివరించారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి కేటాయించే స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ప్రగడ సూచించారు. కూటమి ఐక్యతను కాపాడుతూ అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీ-ఫారాలు రాని నాయకులు నిరుత్సాహపడవద్దని, పార్టీ కోసం పనిచేసిన వారికి భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని పప్పల చలపతిరావు తెలిపారు. నాలుగు మండలాల నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.