
ఏటికొప్పాక గ్రామపంచాయతీలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న కాపారపు ఆదినారాయణ విధి నిర్వహణలో ఉండగా కాలికి తీవ్ర గాయమైంది. గాయం కారణంగా ప్రస్తుతం పనికి వెళ్లలేక, సరైన వైద్య చికిత్స పొందలేని పరిస్థితిలో ఇంటికే పరిమితమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కుటుంబానికి ఆధారంగా ఉన్న ఆదినారాయణ ఉపాధి కోల్పోవడంతో కుటుంబం ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో పడింది. గ్రామ పరిశుభ్రత కోసం నిత్యం శ్రమిస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు తగిన వైద్య సదుపాయాలు, ఆర్థిక భరోసా అందడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదినారాయణ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు మానవతా దృక్పథంతో స్పందించి ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించడంతో పాటు ఆర్థిక సహాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.