
అనకాపల్లి, అక్టోబర్ 17:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు పటిష్ట చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా నర్సీపట్నం, కసింకోట పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లు, పాత నేరస్థులు మరియు చెడు నడత కలిగిన వ్యక్తులను స్టేషన్కు పిలిపించి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు మాట్లాడుతూ...
"రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి ప్రశాంత వాతావరణంలో, నిష్పాక్షికంగా మరియు పారదర్శకంగా నిర్వహించడమే జిల్లా పోలీసు యంత్రాంగం యొక్క ప్రధాన లక్ష్యం. ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతిభద్రతలకు భంగం కలిగించినా, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా, చట్టవ్యతిరేక లేదా సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదు. రౌడీషీటర్లు తమ వైఖరిని మార్చుకుని సత్ప్రవర్తనతో మెలగాలి. ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి ఘర్షణలు లేదా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ సహా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు." అని హెచ్చరించారు.
నర్సీపట్నం టౌన్:
నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ పోతిరెడ్డి శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో, నర్సీపట్నం టౌన్ సీఐ గఫూర్, ఎస్సై ఉమామహేశ్వర్ స్థానిక రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి రాజకీయ వివాదాలు, గొడవలు మరియు అవాంఛనీయ చర్యల్లో పాలుపంచుకోవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారు.
కసింకోట:
అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ పీ.వీ.వీ. నరసింహారావు గారి పర్యవేక్షణలో, కసింకోట ఇన్స్పెక్టర్ స్వామి నాయుడు ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో జీవించాలని, ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు లేదా శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.