శాంతిభద్రతల పరిరక్షణ అందరి బాధ్యత,గంజాయి నిర్మూలన, మహిళల భద్రత మరియు ఎన్నికల నియమావళిపై విస్తృత అవగాహన మంగవరం గ్రామంలో గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించిన సీఐ వినోద్ బాబు, ఎస్సై పురుషోత్తం
పాయకరావుపేట, అక్టోబర్ 15:
పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామమైన మంగవరంలో 'పల్లె నిద్ర' కార్యక్రమంలో భాగంగా ప్రజలతో ముఖాముఖి మరియు శాంతిభద్రతలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (సీఐ) వినోద్ బాబు, ఎస్సై పురుషోత్తం పాల్గొని గ్రామస్తులతో నేరుగా మాట్లాడారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు పలు కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు:
గంజాయి నిర్మూలన – చట్టపరమైన చర్యలు:
గంజాయి సేవించడం వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు, అక్రమ రవాణాకు పాల్పడితే ఎదురయ్యే కఠిన చట్టపరమైన చర్యల గురించి వివరించారు. గ్రామంలో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల రవాణా, విక్రయాలకు సంబంధించిన ఎలాంటి అనుమానాస్పద సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
మహిళల భద్రత – అత్యవసర సేవలు:
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ అందిస్తున్న చట్టపరమైన రక్షణలు, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లపై (డయల్ 112, 100 తదితర) అవగాహన కల్పించారు. మహిళలపై వేధింపులు, గృహహింస వంటి ఘటనలను ఏమాత్రం సహించవద్దని, అలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు – శాంతిభద్రతలు:
మంగవరం గ్రామం సమస్యాత్మక గ్రామంగా గుర్తించబడిన నేపథ్యంలో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గ్రామస్తులంతా పూర్తి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత మరియు ఎన్నికల సజావు నిర్వహణకు పోలీసులకు ఎల్లవేళలా సహకరిస్తామని గ్రామస్తులు హామీ ఇచ్చారు.