ఏపీ పంచాయతీ ఎన్నికలకు కొత్త రిజర్వేషన్ నిబంధనలు..

ఏపీ పంచాయతీ ఎన్నికలకు కొత్త రిజర్వేషన్ నిబంధనలు..

14/October/2026 06:32    Share:   

రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు.. మహిళలకు 50 శాతం కేటాయింపు

అమరావతి, అక్టోబర్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. G.O.Ms.No.154, తేదీ 12-10-2026 ద్వారా ఏపీ పంచాయతీరాజ్ (స్థానాలు, పదవుల రిజర్వేషన్) నిబంధనలు–2026ను ప్రకటించినట్లు సమాచారం.
ఈ నిబంధనల ప్రకారం సాధారణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి కేటాయించే రిజర్వేషన్లు గరిష్ఠంగా 50 శాతానికి మించకూడదు. రిజర్వేషన్ల కేటాయింపులో తొలుత ఎస్టీ, అనంతరం ఎస్సీ, ఆ తర్వాత బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
అలాగే అన్ని రిజర్వేషన్ కేటగిరీలతో పాటు జనరల్ కేటగిరీలోనూ మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయించే విధంగా నిబంధనలు రూపొందించినట్లు సమాచారం. గ్రామీణ స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంపొందించడమే ఈ కేటాయింపుల లక్ష్యంగా భావిస్తున్నారు.
ఈ నిబంధనలు వార్డు సభ్యులు, గ్రామ సర్పంచులు, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీ), మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (జెడ్పీటీసీ), జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవులకు వర్తించనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వం విడుదల చేసిన ఈ మార్గదర్శకాలతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు, స్థానాల కేటాయింపుపై స్పష్టత రానుంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు, రాజకీయ పార్టీల నాయకులు రిజర్వేషన్ల ఖరారుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

క్రైమ్ ఎనాలసిస్ చీపురుపల్లి రిపోర్టర్ ఎస్.ఏ.ఎన్. రాజు
Breaking News

Subscribe our Newsletter