సేవా సంకల్ప అభియాన్–2026లో భాగంగా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ), యూడీఆర్ జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, ఆసుపత్రి పరింటెండెంట్ రవి తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రీయ పోషణ మాసం–2026లో భాగంగా ‘ఆరోగ్యమైన బిడ్డ–ఆనందకరమైన కుటుంబం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా సీమంత కార్యక్రమం నిర్వహించడంతో పాటు అంగన్వాడీ టీచర్లను సత్కరించారు. అనంతరం వివిధ వైద్య విభాగాలు ఏర్పాటు చేసిన వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన స్టాళ్లను సందర్శించారు.ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తొలి ఐదేళ్లు అత్యంత కీలకమని అన్నారు. ఈ దశలో పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, మంచి అలవాట్లు పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పోషకాహారంతో పాటు ఆరోగ్యం, శారీరక, మానసిక వికాసంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు.పిల్లలకు సరైన పోషకాహారం అందించడంపై తల్లిదండ్రులకు అంగన్వాడీ సిబ్బంది నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలను చిన్నారుల ఆరోగ్యం, విద్య, మానసిక వికాసానికి పునాది వేసే కేంద్రాలుగా మరింత బలోపేతం చేయాలని కోరారు.