యలమంచిలి :సకల ఆగమ అర్చక సంక్షేమ సమూహం సంఘం ప్రతి రెండు నెలలకు ఒకసారి జరిగే సమావేశాల నిమిత్తం పట్టణంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న శ్రీ గుర్రప్ప వారి సత్రం కళ్యాణ మండపాన్ని ఇప్పించాలని కోరింది. ఈ మేరకు పట్టణ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తేజకు వినతిపత్రాన్ని సమర్పించారు. శ్రీ గుర్రప్ప వారి సత్రంలోని కళ్యాణ మండపాన్ని లీజుకు ఇస్తూ దేవాదాయ శాఖ అధికారులు బహిరంగ వేలం వేయనున్నట్లు పత్రికా ముఖంగా తెలుసుకున్నామని అర్చకులు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.అనకాపల్లి జిల్లా దేవాదాయ శాఖ పరిధిలోని అర్చకులందరూ కలిసి 'సకల ఆగమ అర్చక సంక్షేమ సమూహం'గా ఏర్పడ్డామని, తమ కష్టసుఖాలు మరియు సమస్యలపై చర్చించుకునేందుకు ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నామని వారు వివరించారు. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో మాత్రమే తాము ఈ సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. కావున అధికారుల సమక్షంలో లీజుదారునికి తమ విన్నపాన్ని తెలియజేసి, రెండు నెలలకు ఒకసారి జరిగే తమ సమావేశాలకు ఆ కళ్యాణ మండపాన్ని ఉచితంగా వినియోగించుకునేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు ఈఓ తేజ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కాళ్ళకూరి కామేశ్వర శర్మ, సుదర్శనం నారాయణాచార్యులు, నేతేటి గోపాల కృష్ణ, మృత్యుంజయ శర్మ, రాచకొండ శ్రీనివాస శర్మ, జగదీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.