చీపురుపల్లి, అక్టోబర్ 5 విధి నిర్వహణలో మాతృత్వాన్ని చాటుకుంటూ ప్రజాసేవకు అంకితమైన గరివిడి మండలం గెడ్డపువలస గ్రామ సచివాలయ మహిళా పోలీస్ కోరాడ రమ్యారాణిని అధికారులు ఘనంగా సన్మానించారు. ఇటీవల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తన చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు అందించిన ఆమె సేవలను జిల్లా కలెక్టర్ అభినందించడంతో పాటు అధికారులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా గరివిడి మండల తహసీల్దార్ బంగారు రాజు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, రెవెన్యూ, మండల పరిషత్, సచివాలయ సిబ్బంది రమ్యారాణిని ఘనంగా సన్మానించారు. చంటి బిడ్డను వెంట తీసుకెళ్లి బాధ్యతగా పెన్షన్ల పంపిణీ చేపట్టడం ద్వారా విధి పట్ల ఆమెకున్న నిబద్ధతను చాటుకున్నారని అధికారులు కొనియాడారు. ఈ సందర్భంగా రమ్యారాణి మాట్లాడుతూ తన బిడ్డతో పాటు మంచానపడిన వృద్ధులు, దివ్యాంగులు కూడా తనకు పిల్లలతో సమానమేనని అన్నారు. అందుకే పెన్షన్ల పంపిణీ విధులకు తన బిడ్డతో హాజరై బాధ్యత నిర్వర్తించానని తెలిపారు. తన సేవలను గుర్తించి సన్మానించిన అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన సేవల వెనుక తండ్రి కోరాడ రామకృష్ణ (రిటైర్డ్ రైల్వే ఉద్యోగి), తల్లి కోరాడ రమ, భర్త అజారుద్దీన్ సహకారం ఎంతో ఉందన్నారు. అలాగే గుర్ల మండలం వల్లాపురం గ్రామపంచాయతీ కార్యదర్శి జే. అచ్యుతరావు అందించిన సూచనలు, సహకారం కూడా తనకు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గరివిడి ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ బంగార్రాజు, ఆర్‌ఐ అచ్యుతరావు, మండల పరిషత్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.