యలమంచిలి, అక్టోబర్ 3: అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం మర్రిబంద జంక్షన్ వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 3వ తేదీ ఉదయం సుమారు 5 గంటల సమయంలో తుని నుంచి అనకాపల్లి వైపు పండ్ల లోడుతో వెళ్తున్న ఏపీ 39 WR 3630 నంబరు గల టాటా ఇంట్రా వ్యాన్, రహదారి పక్కన నిలిపి ఉంచిన ఒడిశా రాష్ట్రానికి చెందిన OD 07 BG 0870 నంబరు గల ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వారిగా ప్రాథమిక సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.