అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం, పోషకాహారం అందించడంతో పాటు బాల్య వికాసానికి బాటలు వేయవచ్చని చీపురుపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి పి. నాగమణి అన్నారు. చీపురుపల్లి పట్టణ పరిధిలోని రామాంజనేయ కాలనీ, అంబేద్కర్ కాలనీ అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన అంగన్వాడీ వారోత్సవాలు, పోషణ్ మాసం–2026 కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ తల్లులు, పిల్లల సంక్షేమమే ఐసీడీఎస్ ప్రధాన లక్ష్యమన్నారు. అంగన్వాడీ కేంద్రాలే చిన్నారులకు తొలి ఆరోగ్య, పోషణ కేంద్రాలని పేర్కొన్నారు. సరైన వయసులో సమతుల్యమైన పోషకాహారం అందించడం ద్వారా పిల్లల శారీరక, మానసిక వికాసం మెరుగుపడుతుందన్నారు. మిల్లెట్స్, ఆకుకూరలు, అందుబాటులో ఉండే తక్కువ ఖర్చు పోషకాహార పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. గర్భిణులు గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ‘‘ఆరోగ్యకరమైన బిడ్డలు – అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్’’ లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. అంగన్వాడీ సూపర్వైజర్ పి. శశికళతో పాటు రామాంజనేయ కాలనీ అంగన్వాడీ కార్యకర్త బొడ్డేపల్లి రాము, అంబేద్కర్ కాలనీ కార్యకర్త రోజాలను విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించారు