అనకాపల్లి, అక్టోబర్ 2:
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్‌ను సీఈసీ పదవి నుంచి తక్షణమే తొలగించాలని, ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను నిలిపివేసి ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన అర్హులైన ఓటర్ల హక్కులను పునరుద్ధరించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. శుక్రవారం అనకాపల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయం సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం అనకాపల్లి మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్. దొరబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్. శంకర్రావు మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ పేరుతో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాల నుంచి తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్‌గా ఉన్నప్పటికీ, మిగిలిన ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాలను పక్కనపెట్టి కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య హక్కులను బలహీనపరిచే చర్యగా వారు విమర్శించారు.
ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, పునరుద్ధరణ, ఎస్‌ఐఆర్ ప్రక్రియ, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ వంటి అంశాల్లో అభ్యంతరాలు వ్యక్తమైనట్లు వచ్చిన నివేదికలను వారు ప్రస్తావించారు. ఓటర్ల డేటాబేస్ కేంద్రీకృతం కావడం, రాష్ట్ర స్థాయి చట్టబద్ధ అధికారుల పాత్రను పరిమితం చేసే విధంగా సాంకేతిక వ్యవస్థలు మారుతున్నాయన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయని తెలిపారు.