కార్పొరేట్ల లాభాల కోసం రైతాంగాన్ని లూటీ చేస్తున్నారు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏఐకేఎస్ నేత విజూ కృష్ణన్ మండిపాటు
05/July/2026 22:31
Share:
#కార్పొరేట్ల లాభాల కోసం రైతాంగాన్ని బలి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. #రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలం.. #స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి. #29న ఢిల్లీలో రైతు సంఘాల జాతీయ సమావేశం.. #ఆగష్టు 10న రైతాంగ సమస్యలపై జైల్ భరో కార్యక్రమం.. #దేశ వ్యాప్తంగా రైతు ఉద్యమం తీవ్రతరం చేస్తాం.. #అఖిల భారత కిసాన్ సభ (ఏ.ఐ కె.ఎస్ ) జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు
దేశంలో కార్పొరేట్ల లాభాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలతో రైతాంగాన్ని లూటీ చేస్తున్నారని అఖిల భారత కిసాన్ సభ (ఏ.ఐ.కె.ఎస్ ) జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ తీవ్రంగా విమర్శించారు. ఆదివారం డి.సి.ఎం.ఎస్ ఫంక్షన్ హలు (బడా సుబ్బారెడ్డి, వై.జోయా నగర్)లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజూ కృష్ణన్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సూర్యనారాయణ,రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజూ కృష్ణన్ మాట్లాడుతూ దేశంలోని రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పనిచేస్తూ రైతుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరిస్తున్నాయని విమర్శించారు.2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయకపోవడం రైతాంగానికి చేసిన పెద్ద మోసమని అన్నారు.పంటల ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నప్పటికీ రైతులకు కనీస మద్దతు ధరలు లభించడం లేదని, ఫలితంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు తగిన రుణ సదుపాయాలు అందడం లేదని, వ్యవసాయ సబ్సిడీలు కూడా సక్రమంగా అందడం లేదన్నారు. పంటల నష్టాలు పెరగడంతో అప్పులు, గిట్టుబాటు ధర లేక గడిచిన 12ఏళ్లలో 10లక్షలు మంది రైతులు ఆత్మహత్యలకు చేసుకున్నారని గుర్తు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని జాతీయ క్రైమ్ బ్యూరో నివేదిక వెల్లడించాయని వివరించారు.రైతుల ఆత్మహత్యలు నివారణ చర్యలు చేపట్టడంలో పాలకులు విఫలమయ్యాయని విమర్శించారు. అభివృద్ధి పేరుతో రైతుల భూములను బలవంతంగా సేకరిస్తూ, పారిశ్రామిక కారిడార్లు, రహదారులు,ప్రత్యేక ప్రాజెక్టుల పేరుతో కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో లక్షా అరవై వేల ఎకరాల భూమి కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం,పునరావాసం కల్పించకుండా వారి జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పారు. కోవిడ్-19 సమయంలో దేశ ప్రజలపై కఠినమైన లాక్‌డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం, అదే సమయంలో కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను అప్పగించే విధానాలను వేగవంతం చేసిందని విజూ కృష్ణన్ విమర్శించారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించే మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకురావడంతో దేశవ్యాప్తంగా రైతాంగం ఏడాదిన్నర పాటు చారిత్రాత్మక పోరాటం నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఆ ఉద్యమంలో 736 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. రైతాంగ పోరాటాల ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందన్నారు. కార్మికుల దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించిన హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని ఆయన విమర్శించారు. రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీల ఐక్య పోరాటాలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో విదేశాల నుండి నూనెగింజలు, పత్తి, మొక్కజొన్న, పాల ఉత్పత్తులు తదితర వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు ప్రోత్సాహం ఇస్తూ సుంకాలను తగ్గించడం లేదా ఎత్తివేయడం వల్ల దేశీయంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. దేశంలో రైతులు పండించిన పంటలకు మార్కెట్ లేకుండా చేస్తూ కార్పొరేట్ దిగుమతి వ్యాపారాలకు లాభాలు చేకూర్చే విధానాలను ప్రభుత్వం అనుసరిస్తోందని ఆరోపించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి పరిష్కారంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని, పంటల ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించాలని, రైతుల అప్పులను మాఫీ చేయాలని, రైతు ఆత్మహత్యలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, భూసేకరణలో రైతుల హక్కులను రక్షించాలని విజు కృష్ణన్ డిమాండ్ చేశారు. 29న ఢిల్లీలో రైతు సంఘాల జాతీయ సమావేశం.. ఈనెల 29న ఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాలతో జాతీయ స్థాయి సమావేశం జరుగుతుందని తెలిపారు.దేశ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడేందుకు రైతులు, కార్మికులు, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.రైతాంగ సమస్యలపై ఆగష్టు 10న రైతుల జైల్ భరో కార్యక్రమం నిరహిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ మాట్లాడుతూ మోడీ రైతు వ్యతిరేక విధానాలను చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా రైతు అప్పులలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం చిన్న మధ్యతరగతి ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం కోసం రూ 12వేల కోట్లు కేటాయిస్తే 7లక్షలు ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆయన సూచించారు. వాతావరణ మార్పులతో సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాని వాపోయారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వ అధీనంలోనే విత్తనపరిశోధన అవసరమన్నారు.విత్తనాల పరిశోధన ప్రయివేట్ కంపెనీ లకు ఇవ్వడం వల్ల పంటల దిగుబడి తగ్గిందనన్నారు. మార్కెట్ లో రైతులు పండించిన పంటలకు ధర ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ బ్యాంకులను ప్రభుత్వం తగ్గిస్తుందని పెట్టుబడులు కోసం వడ్డీ, మైక్రో ఫైనాన్స్ లతో వ్యవసాయం చేస్తున్నారని ప్రభుత్వం రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టడం అత్యవసరమని డిమాండ్ చేశారు.రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.