(ప్రేమ సమాజం):
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రేమ సమాజంలో వృద్ధులకు ఉచిత వైద్య సదుపాయం, న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి పి. విజయ్ కుమార్ (పి. వి. జియా) వృద్ధులకు చట్టాలపై ఉన్న హక్కులను వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సొంత ఆదాయం లేదా ఆస్తి లేక తమను తాము పోషించుకోలేని తల్లిదండ్రులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు తమ పిల్లలు లేదా చట్టపరమైన వారసుల నుండి భరణం (మెయింటెనెన్స్) కోరే పూర్తి హక్కును కలిగి ఉంటారని స్పష్టం చేశారు. సుదీర్ఘ కాలం పాటు నడిచే సివిల్ కోర్టు కేసులతో పని లేకుండా, వృద్ధులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ప్రభుత్వం ప్రతి సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీవో (RDO) ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసిందని ఆమె తెలిపారు. వృద్ధులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని సత్వర న్యాయం పొందవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ మనీషా, డాక్టర్ మనోజ్, ప్రముఖ న్యాయవాదులు వెంకట రామకృష్ణారావు, ఎం. శ్రీనివాసరావు, బి. ఆర్. శంకర్రావు, ప్రేమ సమాజం కోఆర్డినేటర్ రామకృష్ణారావు, చిరంజీవి, పి. ఎల్. వి. మరియు సంస్థ ప్రతినిధులు, సిబ్బంది, పాల్గొన్నారు.