పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల రక్షణకై

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల రక్షణకై 'అభయ' ప్రత్యేక కార్యక్రమం 

02/October/2026 11:14    Share:   

అనకాపల్లి జిల్లా 
 
ప్రజా రవాణా వాహనాల్లో 'అభయ QR కోడ్' స్టిక్కర్ల అతికింపు – ప్రముఖ సినీ నటులు సాయికుమార్, సుమన్‌లతో అవగాహన ప్రచారం 

అనకాపల్లి, అక్టోబర్ 01: మహిళలు, యువతులు, విద్యార్థినుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, IPS గారి ప్రత్యేక చొరవతో చేపట్టిన వినూత్న 'అభయ' 
(ABHAYA) కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు సాయికుమార్, సుమన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 

సమాజంలో విస్తృత చైతన్యం తెచ్చేందుకు వీరి ప్రత్యేక వీడియో సందేశాలతో అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు.  
ప్రముఖ నటులు సాయికుమార్, సుమన్ పిలుపు: 
సినీ నటుడు సాయికుమార్: "మహిళలపై జరిగే ఎలాంటి వేధింపులనైనా సహించేది లేదు. ప్రయాణంలో అసౌకర్యం కలిగితే వాహనాల్లోని QR కోడ్‌ను స్కాన్ చేసి నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వండి. 'మీ భద్రత – అనకాపల్లి పోలీస్ బాధ్యత'గా పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు."
​సినీ నటుడు సుమన్: "కుటుంబ పోషణ, బాధ్యతల కోసం ఉద్యోగాలు చేస్తూ కష్టపడే మహిళలు పని ప్రదేశాల్లో గానీ, ప్రయాణాల్లో గానీ వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కు గురైతే ఏమాత్రం భయపడవద్దు. సమస్య ఎదురైన వెంటనే వాహనాల్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిపోర్ట్ చేయండి, లేదా తక్షణ అత్యవసర సహాయం కోసం డయల్ 112 ను సంప్రదించండి. పోలీసులు వెంటనే స్పందించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటారు."  

​'అభయ QR కోడ్' విధానం: 
జిల్లా పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో బస్సులు, ఆటోలు, క్యాబ్‌లలో 'అభయ QR కోడ్' స్టిక్కర్లను అతికిస్తున్నారు. వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు లేదా పని ప్రదేశాల్లో మహిళలు వేధింపులకు గురైతే, ఈ QR కోడ్‌ను స్కాన్ చేసి వివరాలు నమోదు చేయగానే,  కంట్రోల్ రూమ్‌తో పాటు స్థానిక పోలీసులకు సమాచారం అందుతుంది. సమీప పెట్రోలింగ్ వాహనాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ కల్పిస్తాయి. బాధితుల వివరాలు పూర్తి గోప్యంగా ఉంచబడతాయి.  
అత్యవసర హెల్ప్‌లైన్లు: తక్షణ రక్షణకు 112, సైబర్ నేరాల ఫిర్యాదులకు 1930.  

ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, IPS హెచ్చరిక: ప్రజా రవాణా వాహనాల్లో అతికించిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించరాదని, మహిళలతో డ్రైవర్లు మర్యాదగా మెలగాలని స్పష్టం చేశారు. మహిళలను వేధించే ఆకతాయిలపై కఠిన చర్యలు తప్పవని, మహిళలందరూ నిస్సంకోచంగా ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
​ 
Breaking News

Subscribe our Newsletter