పత్తికాయవలసలో తుఫాన్‌కు దెబ్బతిన్న అరటి తోటల పరిశీలన
చీపురుపల్లి:
రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అన్ని విధాలా సకాలంలో అందేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని స్థానిక శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు స్పష్టం చేశారు. ఇటీవల సంభవించిన తుఫాన్, ఈదురుగాలుల ధాటికి చీపురుపల్లి మండలం, పత్తికాయవలస గ్రామంలో తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
చేతికొచ్చిన అరటి పంట నేలమట్టం కావడంతో తీవ్ర ఆవేదనలో ఉన్న రైతులను ఎమ్మెల్యే పరామర్శించి, వారికి జరిగిన ఆర్థిక నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులెవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పంట నష్టం వివరాలపై అధికారులతో స్వయంగా మాట్లాడి, సమగ్ర నివేదిక రూపొందించేలా చూస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి రైతుకూ ప్రభుత్వ సాయం త్వరితగతిన అందేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, బాధితులు పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ చీపురుపల్లి రిపోర్టర్
ఎస్.ఎన్. అప్పలరాజు