క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
యలమంచిలి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయుడబ్ల్యూజే) 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో విలేకరులు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం ప్రధాన కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు.
ఉత్సవాల్లో భాగంగా కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులను ఘనంగా సత్కరించి, పారితోషికాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఏపీయుడబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ మెంబర్ గుమ్మెళ్ల గోవిందరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు రుద్ర సింహాచలం (చిట్టిబాబు) మాట్లాడుతూ.. సమాజంలో పత్రికా విలేకరులకు విశిష్టమైన గౌరవం ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధిగా పనిచేస్తున్నారని తెలిపారు. సమాజంలోని లోటుపాట్లను ఎత్తిచూపడంతో పాటు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో విలేకరుల పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు.గత 70 ఏళ్లుగా ఏపీయుడబ్ల్యూజే సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తోందని, జర్నలిస్టులు ఎల్లప్పుడూ సమాజ హితం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆడారి గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పోలిశెట్టి శ్రీమన్, మూర్తి, నాయుడు, కిషోర్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు దుబాశ రమణ, దాట్ల సుబ్బరాజు, ఉపాధ్యక్షుడు గణేష్, సహకార్యదర్శి సంతోష్, సీనియర్ పాత్రికేయులు పెద్దింటి సూర్యనారాయణమూర్తి, శేషగిరి, చిన్నాజీ, శివ, రాము, లోకేష్,టివియస్ ప్రకాష్, గిన్నె ఆదిరెడ్డి, తదితరులు, ప్రెస్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.