సానుకూల స్పందన.. మున్సిపల్ కార్మికుల రిలే దీక్షల విరమణ
15/June/2026 18:19
Share:
అనకాపల్లి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం 14వ రోజుకు చేరుకున్నాయి. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కార్మికుల పిల్లలకు ఖాళీగా ఉన్న పారిశుధ్య కార్మికుల పోస్టుల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జోనల్ కమిషనర్‌ను కార్మిక సంఘ నాయకులు కోరారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దృష్టికి సమస్యలను తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించిన విషయాన్ని కార్మిక నాయకులు వెల్లడించారు. అనంతరం జోనల్ కమిషనర్ డాక్టర్ లక్ష్మి తులసి మాట్లాడుతూ, జివిఎంసి ఉన్నతాధికారులు ఖాళీగా ఉన్న పారిశుధ్య కార్మికుల పోస్టుల వివరాలను కోరారని, వాటిని ఇప్పటికే పంపించామని తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందిన వెంటనే అర్హులైన కార్మిక కుటుంబాలకు న్యాయం చేసే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.దీంతో కార్మికులు సానుకూల స్పందన వ్యక్తం చేస్తూ తమ రిలే నిరాహార దీక్షలను విరమించారు. దీక్షలను విరమింపజేస్తూ జోనల్ కమిషనర్ డాక్టర్ లక్ష్మి తులసి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌లు దీక్షా శిబిరంలో పాల్గొన్న కార్మికులకు నిమ్మరసం అందజేశారు. అనకాపల్లి జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షులు గంటా శ్రీరామ్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని,కార్మిక కుటుంబాలందరికీ తగిన న్యాయం చేయాలని కోరారు.భవిష్యత్తులో సమస్యలు పరిష్కారం కాకపోతే వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కాళ్ల తేలయ్యబాబు, నూకరాజు, ఏసు, ఓం నమశివ, బి. దేవి, చెన్నా సత్యవతి,పాల్గొన్నారు