రాజకీయ కక్షసాధింపు చర్యలు ఆపాలి: వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టులపై ధ్వజమెత్తిన ఏలూరు జిల్లా నాయకత్వం
ఏలూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, అక్రమ అరెస్టులతో వేధింపులకు గురిచేస్తోందని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా విభాగం తీవ్రంగా ఖండించింది. ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ కారుమూరి సునీల్ కుమార్ గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ, ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఒక అత్యవసర పత్రికా సమావేశం నిర్వహించారు.
ఈ మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు గారు, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్ (జేపీ) గారు, ఉంగుటూరు నియోజకవర్గ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గారు, చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జ్ కంభం విజయరాజు గారు మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు మరియు నియోజకవర్గ ఇంచార్జ్ లు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను గాలికొదిలేసి, ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. కారుమూరి సునీల్ కుమార్ అరెస్ట్ పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యేనని వారు స్పష్టం చేశారు.
గ్రామగ్రామాన బెల్ట్ షాపులు - ప్రశ్నిస్తే అక్రమ కేసులు:
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి పల్లెటూరులోనూ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలిశాయని నేతలు ఆరోపించారు. మద్యం దుకాణాలలో సిండికేట్ గా మారి ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే విపరీతంగా దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను, మద్యం అధిక ధరలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి, రాత్రికి రాత్రే అరెస్టులు చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు.
రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రజాక్షేత్రంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు.