ఎచ్చెర్ల, సెప్టెంబర్ 27:
విద్యార్థులు, యువత తమ భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సూచించారు. ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో ఆయన సమావేశమై భవిష్యత్తు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ లంక శ్యామల రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మెగా డీఎస్సీ, పోలీస్ నియామకాలు, జాబ్ క్యాలెండర్‌తో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. నియామక ప్రక్రియలో పారదర్శకతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, ఐటీ–విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో దేశ, విదేశీ సంస్థలతో ఒప్పందాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విశాఖను డేటా హబ్‌గా అభివృద్ధి చేయడంతో పాటు గూగుల్ డేటా సెంటర్, కాగ్నిజెంట్ వంటి సంస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు విస్తరించే అవకాశం ఉందన్నారు.
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని ఎంపీ తెలిపారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని రాబోయే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.