CA న్యూస్ రిపోర్టర్ ఆనంద్
యలమంచిలి, సెప్టెంబర్ 20:
యలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం కంచరపాలెంకు చెందిన దంతేష్ (36) విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు తన మోటార్‌సైకిల్ (AP 40 JC 3338)పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో తనకు ముందు వెళ్తున్న లారీ (OD 05 X 8544)ను ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేసే క్రమంలో బైక్ అదుపుతప్పి స్కిడ్ అయి లారీ వెనుక చక్రాల కిందకు వెళ్లింది. సమాచారం అందుకున్న యలమంచిలి రూరల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, దంతేష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు. అనంతరం పోలీసులు రహదారిపై నిలిచిపోయిన వాహనాలను క్రమబద్ధీకరించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.