- ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జి. స్పందన
యలమంచిలి : బాలికలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు, వారికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు రూపొందించిన పోక్సో చట్టంపై ప్రతి విద్యార్థిని అవగాహన కలిగి ఉండాలని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జి. స్పందన పేర్కొన్నారు. మంగళవారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో యలమంచిలి పట్నంలో గల బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినుల కోసం ప్రత్యేక న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి జి. స్పందన మాట్లాడుతూ, నేటి సమాజంలో బాలికలు తమ హక్కులు, చట్టాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా లేదా వేధింపులకు గురిచేసినా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా పోక్సో చట్టం ఎంతగానో అండగా ఉంటుందని వివరించారు. అలాగే ఆపద సమయంలో తక్షణ సహాయం కోసం చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098, పోలీసు అత్యవసర నంబర్ 112 లేదా 100 కు ఫోన్ చేయవచ్చని అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సహాయం కోసం మండల న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి.వి. రమణ, కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఎల్.వి. రామకృష్ణారావు, ప్యానెల్ లాయర్ బి. హరిశంకర రావు, పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు వి. పద్మజ, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.