32 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతాం..!!చైర్మన్ అభ్యర్థిగా దొడ్డి రవి పేరు పరిశీలన..!!!
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ (స్పెషల్ రిపోర్టర్ ) :
రానున్న ఎలమంచిలి మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం గురువారం ఎలమంచిలిలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డ శ్రీనివాస్, ఎలమంచిలి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డి రవి, నియోజకవర్గ ఇన్‌చార్జి తనకాల అనంతరావు, కాంగ్రెస్ నాయకులు రావి, ఎం.వి. రాహుల్, సుందరపు ఈశ్వరరావుతో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, వార్డుల వారీగా పార్టీ బలోపేతం తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఎన్నికల్లో ఎలమంచిలి పట్టణంలోని 32 వార్డుల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు నాయకులు తెలిపారు.
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. దొడ్డి రవి పేరును చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదించి, సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు నాయకులు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందని, పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై పోరాటానికి ఆకర్షితులై మరింత మంది పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని నాయకులు పేర్కొన్నారు. పార్టీపై ఆసక్తి చూపుతున్న ఆశావహులు, నాయకులు, కార్యకర్తలందరినీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా పలువురు కొత్త కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలను ప్రశ్నించే గొంతుకగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నట్లు ప్రకటిస్తూ మీడియా సాక్షిగా ఎలమంచిలి పట్టణంలో సమర శంఖం పూరించినట్లు నాయకులు తెలిపారు.