మునగపాక పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్
స్టేషన్ రికార్డులు, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి
మునగపాక,
సెప్టెంబర్ 16: అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు మునగపాక పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి, తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని సాధారణ డైరీ, క్రైమ్ రికార్డులు, పెండింగ్ కేసుల దస్త్రాలు, రిసెప్షన్ నిర్వహణ, ఆయుధాగారంతో పాటు పరిసరాల పరిశుభ్రతను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించి న్యాయం చేయాలని స్పష్టం చేశారు.పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, నాన్-బెయిలబుల్ వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.గ్రామాల్లో రాత్రిపూట గస్తీని (బీట్ సిస్టమ్) ముమ్మరం చేయాలని, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల నిఘాను పెంచాలని తెలిపారు.గంజాయి, నాటుసారా,అక్రమ మద్యం రవాణా,పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.మహిళల భద్రత: మహిళలు, చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, 'శక్తి యాప్' పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పోలీస్ శాఖ గౌరవాన్ని మరింత పెంచాలని ఎస్పీ తుహిన్ సిన్హా సిబ్బందికి మార్గదర్శనం చేశారు.