“ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది.ఓజోన్‌ను కాపాడుదాం – భవిష్యత్ తరాలను కాపాడుదాం.”
ఎం.పి.యు.పి. పాఠశాల, ఎరుకువాని పాలెంలో ఘనంగా ఓజోన్ దినోత్సవ వేడుకలు
ఎరుకువాని పాలెం, అనకాపల్లి మండలం:
ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఎం.పి.యు.పి. పాఠశాల, ఎరుకువాని పాలెంలో ఓజోన్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ మరియు ఆంధ్రప్రదేశ్ జీవ వైవిద్య సంరక్షణ అవార్డు గ్రహీత శ్రీ కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఓజోన్ పొర ప్రాధాన్యతను వివరించారు. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై ఉన్న జీవరాశులను రక్షించడంలో ఓజోన్ పొర అత్యంత కీలకమైనదని తెలిపారు.
“ఓజోన్ పొరను కాపాడటం అంటే కేవలం ఆకాశాన్ని కాపాడటం కాదు… భూమిపై ప్రతి జీవి భవిష్యత్తును కాపాడటం.” అని ఆయన పేర్కొన్నారు.
ఈరోజు మనం ఓజోన్‌ను రక్షిస్తే… రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన భూమి, సురక్షితమైన భవిష్యత్తును అందించినవారమవుతాం.” అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఓజోన్ పొరను రక్షించేందుకు కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణహిత జీవన విధానాలను పాటించడం, చెట్లను పెంచడం, ప్రకృతి వనరులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
“సేవ్ ఎర్త్” విగ్రహం ఏర్పాటు
కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో “సేవ్ ఎర్త్” విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని డా. కొణతాల రామలింగస్వామి మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శ్రీమతి కొణతాల లక్ష్మీ పార్వతి పాఠశాలకు విరాళంగా అందజేశారు.
విద్యార్థుల్లో భూమి పరిరక్షణ, పర్యావరణ బాధ్యత, ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించేందుకు “సేవ్ ఎర్త్” విగ్రహం ఒక స్ఫూర్తి చిహ్నంగా నిలుస్తుందని కార్యక్రమంలో పేర్కొన్నారు.
“భూమి మనకు ఇచ్చిన సంపద కాదు… భవిష్యత్ తరాల నుంచి మనం తీసుకున్న బాధ్యత. దాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి కర్తవ్యం.” అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీ అరెగల శ్రీనివాస్ రావు గారు, ఉపాధ్యాయులు శ్రీ కె. ఎన్. మూర్తి, శ్రీ బి. వై. వై. ఎస్. కృష్ణారావు గారు, శ్రీమతి పి. జయశ్రీ, శ్రీమతి ఎస్. సుజాత,శ్రీమతి G. ఉమాగారు, D. శ్రీలత గారు విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని “ఓజోన్‌ను కాపాడుదాం – భూమిని రక్షిద్దాం”, “సేవ్ ఎర్త్ – సేవ్ ఫ్యూచర్” వంటి నినాదాలతో పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటిచెప్పారు.