యలమంచిలి: పురపాలక సంఘం పరిధిలో అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయి. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ సరోజిని ఆదేశాల మేరకు, మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో మొత్తం 45 కేంద్రాలలో ఆదివారం ఈ పరీక్షలను నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని ఎంపీపీ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాల్లో ఈ పరీక్షా ఏర్పాట్లు చేశారు. యలమంచిలి పురపాలక సంఘం పరిధిలో మొత్తం 4003 మంది అభ్యాసకులు ఉండగా, వీరికి 400 మంది వాలంటీర్లు గతంలో అక్షరాస్యతపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యాసకులందరికీ ఈ రోజు పరీక్ష నిర్వహించగా 100 శాతం హాజరు నమోదైంది. పరీక్షా కేంద్రాలను మున్సిపల్ కమిషనర్, మెప్మా సిబ్బంది సందర్శించి పర్యవేక్షించారు. ఈ పరీక్షల నిర్వహణలో మెప్మా ఆర్‌పీలు, అంగన్‌వాడీ టీచర్లు ఇన్విజిలేటర్లుగా వ్యవహరించగా,మెప్మా సీఓలు,సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీలు, మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.