రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఏలూరు జిల్లా కూటమి నాయకుల కీలక భేటీ..

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఏలూరు జిల్లా కూటమి నాయకుల కీలక భేటీ..

12/September/2026 20:22    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,

ఏలూరు,అత్యంత సమన్వయంతో గెలుపు గుర్రాలను స్థానిక సంస్థల సమర బరిలో నిలిపి, వీరోచిత విజయమే లక్ష్యంగా ముందుకెళ్తామని ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల అబ్జర్వర్‌, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో కూటమి విజయ కేతనం ఎగురవేయడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు పవర్‌ పేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల సమన్వయ కమిటీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల అబ్జర్వర్‌, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ఆమెకు టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పూలమొక్కను అందించి, ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, ఆర్టీసి విజయవాడ జోన్‌-2 చైర్మన్‌, ఏలూరు జనసేన ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు, ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాస్‌, రాష్ట్ర వడ్డి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఘంటసాల వెంకటలక్ష్మి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, జనసేన నాయకులు నారా శేషు, కస్తూరి సాయి తేజస్విని, బీజేపీ నాయకులు గాది రాంబాబు తదితరులు పాల్గొని అబ్జర్వర్‌ పంచుమర్తి అనురాధకు స్వాగతం పలికారు. 
ఈ సందర్భంగా ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా సమన్వయంతో ముందుకెళ్ళాలనే అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఇదేసమయంలో మూడు పార్టీల ప్రజాప్రతినిధులకు, సమన్వయ కమిటీల ప్రతినిధులకు, ముఖ్య నేతలకు అనురాధ పలు కీలక సూచనలు చేశారు.
అనంతరం అబ్జర్వర్‌ పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో వందశాతం గెలుపే లక్ష్యంగా కూటమి నాయకలు అడుగులు వేస్తున్నారని చెప్పారు. అభివృద్ధితో సంపద సృష్టిస్తోన్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారని ఆమె వెల్లడించారు. అదే మరోసారి స్థానిక సమరంలో రుజువు కానుందంటూ ధీమా వ్యక్తం చేసిన అనురాధ,, జిల్లాలో కూటమి పార్టీల సమన్వయంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలను మీడియా సాక్షిగా ఎండగట్టిన ఆమె,,, కూటమి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు.
టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అందర్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళేందుకు ఈ సమావేశం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్ధిని ప్రకటించిన నాటినుంచి గెలుపు వరకూ అంతటా కలిసికట్టుగా ఉండేలా ప్రణాళికలు, వ్యూహ రచనలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సిద్ధాంతపరమైన పార్టీలంటే గుర్తుకొచ్చేది తెలుగుదేశం, జనసేన, బీజేపీలేనని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, వైసీపీ అంటే విధ్వేషమయమని మండిపడ్డారు. అదే మాదిరిగా స్థానిక ఎన్నికలకు సంసిద్ధమవుతున్న సమయంలోనూ కూటమి సభ్యుల్లో విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ నాయకులు కుట్రలకు తెరతీశారని, కూటమి పార్టీల సమన్వయాన్ని చూసి తోక ముడిచారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో అవసరాన్ని బట్టీ అడుగు వెనక్కి వేసి కూటమి సఖ్యతను ముందుకు తీసుకెళ్ళేందుకు, సమైఖ్యతను గెలిపించేందుకు సంసిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. 
ఆర్టీసి జోన్‌ 2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ వందశాతం స్ట్రైక్‌ రేట్‌తో గెలుపు లక్ష్యంగా స్థానిక ఎన్నికలకు సంసిద్ధమవుతోన్న తీరును వివరించారు. మరోపక్క వైసీపీ నాయకులు కుట్రలకు తెరతీశారంటూ విమర్శలు గుప్పించిన ఆయన,, వాటన్నింటినీ తిప్పికొట్టేందుకు తాము అంతే సమర్థవంతంగా ముందుకెళ్తున్నామంటూ వ్యాఖ్యానించారు. ప్రతీ నియోజకవర్గం లో పరిస్థితులను పరిశీలించి స్థానిక సంస్థల ఎన్నికలకు సిధ్ధమవుతామన్నారు.. కాగా, స్థానిక సమరంపై మూడు పార్టీల కూటమి సమన్వయ కమిటీ సమావేశం కావడంతో పవర్‌ పేటలోని టీడీపీ కార్యాలయం బయట సందడి వాతావరణం నెలకొంది. ఈ సమావేశంలో టిడిపి, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter