గ్రీన్ గణేష్‌తో పర్యావరణ పరిరక్షణకు పిలుపు 3,500 మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ..

గ్రీన్ గణేష్‌తో పర్యావరణ పరిరక్షణకు పిలుపు 3,500 మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ..

12/September/2026 20:04    Share:   

– గ్రీన్ క్లబ్ సేవలను అభినందించిన ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ

అనకాపల్లి, సెప్టెంబర్ 12, 2026:

పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక సంప్రదాయాలను కాపాడే లక్ష్యంతో గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం GVMC హైస్కూల్, రాజా థియేటర్ ఎదురుగా, అనకాపల్లిలో గ్రీన్ గణేష్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజలకు 3,500 మట్టి వినాయక విగ్రహాలతో పాటు వ్రతకథ పుస్తకాలు, పసుపు, కుంకుమ, పటిక, తులసి మొక్కలు తదితర పూజా సామగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైన అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు హాజరై ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలు మరియు పూజా సామగ్రిని పంపిణీ చేశారు. శ్రీ గౌరీ సేవా సంఘం అధ్యక్షులు శ్రీ కర్రి సన్యాసి నాయుడు గారు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ గారు మాట్లాడుతూ, వినాయక చవితి భక్తిశ్రద్ధలకు ప్రతీకగా నిలిచే గొప్ప పండుగ అని, అదే సమయంలో మన పండుగలు ప్రకృతికి హాని కలిగించకుండా జరుపుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.“వినాయకుడిని పూజించడం ఎంత ముఖ్యమో, వినాయకుడి ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా అంతే ముఖ్యమైనది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉంది. అందువల్ల మట్టితో తయారు చేసిన సహజసిద్ధమైన వినాయక విగ్రహాలను ఉపయోగించడం ద్వారా మన భక్తిని, పర్యావరణ బాధ్యతను ఒకేసారి చాటవచ్చు” అని అన్నారు.“మట్టి వినాయకుడు మన సంప్రదాయానికి ప్రతీక మాత్రమే కాదు… పర్యావరణ పరిరక్షణకు ఒక గొప్ప సందేశం. మన పండుగలు ప్రకృతికి పండుగలుగా మారాలి. ప్రతి కుటుంబం మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి, పర్యావరణహితమైన వినాయక చవితిని జరుపుకోవాలి” అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రీన్ క్లబ్ సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ గారు మాట్లాడుతూ, భక్తి మరియు పర్యావరణ పరిరక్షణను కలిపే ఉద్దేశంతో గ్రీన్ గణేష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రజల్లో పర్యావరణ స్పృహ పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు.“భక్తి మనసులో ఉండాలి… వినాయకుడు మట్టిలో ఉండాలి… ప్రకృతి మనతో ఉండాలి” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన వినాయక చవితిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భోగ లింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ కాండ్రేగుల సత్యనారాయణ గారు, నైసిట్టి సత్తిబాబు గారు, బేతాళం శేషసాయి గారు, శ్రీ బొడ్డేడ జోగినాయుడు గారు  శ్రీమతి కర్రి నీలవేణి గారు, శ్రీమతి భానుమతి గారు, శ్రీమతి వరలక్ష్మి గారు, సుంకర పద్మలత గారు, పేరూరి చిన్ని స్వామి గారు, జార్జ్ క్లబ్ అధ్యక్షులు దాడి బుజ్జి గారు, సుంకరమెట్ట సూర్య దేవస్థానం చైర్మన్ శ్రీ బొడ్డేడ  మురళి గారు  తదితరులు పాల్గొన్నారు.అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొని మట్టి వినాయక విగ్రహాలను స్వీకరించారు. పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ క్లబ్ చేస్తున్న సేవలను అభినందించారు.
“గ్రీన్ గణేష్ – స్వచ్ఛమైన పండుగ – ఆరోగ్యకరమైన భవిష్యత్తు” అనే సందేశంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
Breaking News

Subscribe our Newsletter