గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో 3,500 మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ
పర్యావరణ పరిరక్షణతో పాటు సంప్రదాయాలను, ప్రకృతి హితమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రోత్సహించే లక్ష్యంతో గ్రీన్ క్లబ్–అనకాపల్లి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12, 2026 శనివారం ఉదయం 9 గంటలకు అనకాపల్లి రాజా థియేటర్ ఎదురుగా ఉన్న జీవీఎంసీ హైస్కూల్ ప్రాంగణంలో 3,500 మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయు అవార్డు గ్రహీత శ్రీ కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు హాజరై మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అలాగే శ్రీ గౌరీ సేవా సంఘం అధ్యక్షులు శ్రీ కర్రి సన్యాసి నాయుడు గారు ప్రత్యేకంగా పాల్గొననున్నారు.ఈ సందర్భంగా ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలతో పాటు వ్రతకథ పుస్తకాలు, పసుపు, కుంకుమ, పటిక ఉచితంగా అందజేయనున్నారు.“మట్టి వినాయకుడు – మన పర్యావరణానికి మిత్రుడు”
వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా సహజంగా కలిసిపోయే మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించడం ద్వారా జల కాలుష్యాన్ని నివారించవచ్చని గ్రీన్ క్లబ్ నిర్వాహకులు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
“భక్తి ఉండాలి…ప్రకృతిపై బాధ్యత కూడా ఉండాలి,వినాయకుడిని పూజిద్దాం–ప్రకృతిని కాపాడుదాం.”అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గ్రీన్ క్లబ్ 12 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ, వృక్ష సంరక్షణ, పక్షులకు ఆహారం–నీరు అందించడం, ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారం, పర్యావరణ అవగాహన కార్యక్రమాలతో పాటు పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తూ ప్రజల్లో పర్యావరణ స్పృహను పెంపొందిస్తోంది.ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మట్టి వినాయక విగ్రహాలను స్వీకరించి, పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకులు,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవ వైవిద్యం సంరక్షణ అవార్డు గ్రహీత కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.