హేలాపురిని సమస్యల రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం ..
21/August/2026 20:47
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
సమస్యల రహిత నియోజకవర్గంగా హేలాపురిని నిర్మించేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అందుకు అవసరమైన అవగాహనను ప్రజల్లో కల్పిస్తూనే ఎంతో బాధ్యతాయుతంగా ముందుకెళ్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం స్ఫూర్తివంతంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈ శుక్రవారం కూడా స్థానిక పవర్ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. తనను కలిసేందుకు విచ్చేసిన వారందరినీ ఆప్యాయంగా పలకరించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి వారి నుండి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. కొందరు తమకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరగా,,, మరికొందరు తమకు ఇళ్ళ స్థలాలు ఇప్పించాలని విన్నవించారు. ఇలా అనేక మంది తమ సమస్యలను ఎమ్మెల్యే బడేటి చంటి దృష్టికి తీసుకురాగా,,, ప్రతీ సమస్యపై స్పష్టమైన అవగాహనతో ఆయన పరిష్కార మార్గాలు చూపారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మరికొన్ని సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాధినేతల పిలుపు మేరకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్విరామంగా కొనసాగిస్తూ వస్తున్నామన్నారు. ఒకపక్క ప్రజల ఆరోగ్యానికి బాసట కల్పిస్తూనే,,, మరోపక్క పేదలకు ఆర్ధిక భరోసా సైతం చేకూరుస్తూ వస్తున్నామన్నారు. దాంతోపాటూ సొంత ఇంటి స్థలం ఉన్నవారికి లోన్లు వచ్చేలా చేసి వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు కూడా బృహత్తర ప్రణాళికలతో ముందుకెళ్తున్నామన్నారు. అదేవిధంగా పెన్షన్లు, తల్లికి వందనం వంటి పథకాల్లో సైతం అర్హులందరికీ లబ్ది చేకూర్చే లక్ష్యంతో పారదర్శకతతో పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఏలూరును నిలపడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే చంటి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, పార్టీ నాయకులు బెల్లపుకొండ కిషోర్, లంకపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు...