-భోగాపురం ఎయిర్‌పోర్టులో అదనపు వసూళ్లు ఆపాలి..!
-ఆదాయం కోసం ప్రజలను పీక్కు తింటారా చంద్రబాబు...!!
-జీఎంఆర్‌తో బాబు, లోకేష్‌ల లాలూచీ: మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపణలు...!!!
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్, విశాఖపట్నం :
భోగాపురం ఎయిర్‌పోర్టు పేరుతో ప్రజలపై అదనపు భారాలు మోపడం ఆపాలని, స్థానిక మత్స్యకారుల భూములను తీసుకుని వారికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోవడం అన్యాయమని దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం ఆశీలమెట్టలోని కార్యాలయంలో వైసీపీ శ్రేణులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
భోగాపురం ఎయిర్‌పోర్టును జీఎంఆర్‌కు చౌకబేరానికి అప్పగించారని, ఇందుకు చంద్రబాబు, లోకేష్‌లు లాలూచీ పడ్డారని ఆయన ఆరోపించారు. ఎయిర్‌పోర్టు కోసం భూములిచ్చిన మత్స్యకారులకు ఉపాధి, ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. విశాఖ ప్రజలకు అన్యాయం జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
ఎయిర్‌పోర్టు వినియోగదారులపై పార్కింగ్, ప్రయాణికుల చార్జీలు, ఇతర రుసుముల పేరుతో అధిక వసూళ్లు చేస్తున్నారని వాసుపల్లి ఆరోపించారు. ఢిల్లీ, ముంబై వంటి విమానాశ్రయాలతో పోలిస్తే భోగాపురంలో కొన్ని రుసుములు అనేక రెట్లు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. టాక్సీలకు రెండు గంటల పార్కింగ్‌కు రూ.600 వరకు వసూలు చేయడం దారుణమన్నారు.
విమానాల ల్యాండింగ్, టేకాఫ్ చార్జీలు, కార్గో సేవలు, పార్కింగ్, కమర్షియల్ స్పేస్, హాస్పిటాలిటీ వంటి మార్గాల ద్వారా జీఎంఆర్‌కు భారీ ఆదాయం సమకూరుతుందని ఆయన అంచనా వేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలకు, ముఖ్యంగా భూములు కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖ ఎయిర్‌పోర్టు కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి రూ.10 లక్షల పరిహారం అందిస్తామని పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారని వాసుపల్లి తెలిపారు. విశాఖపట్నానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. విశాఖ ఎయిర్‌పోర్టును కొనసాగించడంతో పాటు జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మేయర్ ఎన్నికల్లో వైసీపీ తడాఖా చూపిస్తాం
విశాఖ అభివృద్ధి విషయంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్తుందని, మేయర్ ఎన్నికల్లో పార్టీ తడాఖా ఏమిటో చూపిస్తామని వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు.
గూగుల్ ఒక్క పైసా ఇస్తే విశాఖ రూపురేఖలు మారిపోతాయి
విశాఖలో ఏర్పాటు చేయనున్న గూగుల్ సెంటర్ విషయంలో కూడా ప్రభుత్వ వైఖరిపై వాసుపల్లి విమర్శలు చేశారు. డేటా సెంటర్‌కు భారీ స్థాయిలో నీటి అవసరం ఉంటుందని, ఇప్పటికే నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గూగుల్ నుంచి రాష్ట్ర, స్థానిక అభివృద్ధికి తగిన ఆదాయాన్ని సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గూగుల్ నుంచి ఒక్క పైసా చొప్పున వసూలు చేసినా విశాఖ అభివృద్ధికి భారీ నిధులు సమకూరుతాయని ఆయన అంచనా వేశారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్‌ను మించే స్థాయిలో ఆదాయం పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నిధులతో విశాఖ రూపురేఖలు మార్చవచ్చని, ప్రభుత్వం చేయలేకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి చూపిస్తామని సవాల్ విసిరారు.
ఈ సమావేశంలో వార్డు ప్రెసిడెంట్ దొడ్డి బాపు ఆనంద్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రేయ్యి డేవిడ్ రాజు, జిల్లా జనరల్ సెక్రటరీ గనగళ్ల రామరాజు, స్టేట్ బీసీ సెల్ సెక్రటరీ లండ రమణ, జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ చోడిపిల్లి శివ, సౌత్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఆకుల శ్యామ్, అంబటి అప్పలరాజు, శివరెడ్డి, చేపల రాజు తదితరులు పాల్గొన్నారు.