ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన
యలమంచిలి/రాంబిల్లి, ఆగస్టు 18: రాంబిల్లి మండలం మురకాడ, మర్రిపాలెం గ్రామాలలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం నిర్వహించారు.
ఎల్ నినో ప్రభావం దృష్ట్యా ఈ నెల 31 లోగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలైన కందులు, రాగి, జనుము, మొక్కజొన్న వంటి పంటల సాగుకు రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి రైతు సేవ కేంద్రం పరిధిలో సాగు విస్తీర్ణం అంచనా వేసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని వ్యవసాయ సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో మండల వ్యవసాయ అధికారి సుమంత తెలియజేశారు.
అదేవిధంగా వరి సాగు చేస్తున్న రైతులందరూ ప్రధానమంత్రి ఫసల్ భీమా పథకంలో ఆగస్టు 31వ తేదీ లోగా భీమా చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓ దేవుడు, విఎఎలు జ్యోతి, మేఘన, రాజ్ కుమార్, రామారావు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హేమ, కనక రత్నం మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.