20, 21 తేదీల్లో జరిగే మహాసభల్లో నూతన కమిటీ ఎన్నిక, భవిష్యత్తు కార్యక్రమ ప్రణాళికలపై చర్చ
ఎలమంచిలి, ఆగస్టు 17: ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్.రహమాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సి.హెచ్.కాసుబాబు మాట్లాడుతూ ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే మహాసభలకు 28 జిల్లాల నుండి ఆటో మోటార్ రంగాలకు నాయకత్వం వహిస్తున్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.
కార్మికుల సమస్యలపై ధ్వని:
- కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాదాల నివారణ పేరుతో 894 గజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చారని, దానికి అనుసంధానంగా గత ప్రభుత్వం జీవో నంబర్ 21, 31లను తీసుకురావడం వల్ల వేలాది రూపాయల జరీమానాలు విధిస్తూ ఆటో మోటార్ రంగం కార్మికులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
డిమాండ్లు:
- పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని, లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పన్నులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
- పోలీస్, ఆర్టీఏ చలానా కేసులను ఎత్తివేసి పెండింగ్లో ఉన్న కేసులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
- భారీగా పెరిగిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఆర్టీఏ చలానా చార్జీలను తగ్గించాలని కోరారు.
- ఏ డ్రైవర్ అయినా ప్రమాదంలో చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల నష్టపరిహారం, సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
- ఆర్టీవో కార్యాలయంలో వాహనాల ఫిట్నెస్ (ఎఫ్సీ) ఇతర పనులు ప్రభుత్వ ఆధీనంలో జరగాలని, ప్రైవేట్కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరారు.
- స్త్రీ శక్తి పథకం వలన 60% నష్టపోయిన ట్రాన్స్పోర్ట్ మోటార్ కార్మికులకు నెలకు జీవన భృతి కింద 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
- పీఎఫ్, ఈఎస్ఐ భద్రతతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
- భారీగా పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను అదుపులో ఉంచాలని డిమాండ్ చేశారు.
ముందు రోజు బహిరంగ సభ:
ఈనెల 20వ తేదీ గురువారం పూర్వరంగంగా జీవీఎంసీ గాంధీ పార్కులో బహిరంగ సభ జరుగుతుందని, పెద్ద సంఖ్యలో ఆటో మోటర్ కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కార్యదర్శి గనిశెట్టి.ఏసుదాసు, అలిమిల్లి.నాగేశ్వరరావు (నాగు), నగిరెడ్డి.కుమార్, బంగారం.అప్పలనాయుడు తదితరులు పాల్గొంటారు.