అనకాపల్లిలో క్షీణిస్తున్న చెరకు సాగు,ఆందోళనలో రైతులు, వ్యాపారులు

అనకాపల్లిలో క్షీణిస్తున్న చెరకు సాగు,ఆందోళనలో రైతులు, వ్యాపారులు

17/November/2026 19:59    Share:   

- ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు

అనకాపల్లి :

ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాకే వెన్నెముకగా నిలిచిన చెరకు సాగు నేడు అనకాపల్లి జిల్లాలో క్రమంగా కనుమరుగవుతోంది. చెరకు విస్తీర్ణం భారీగా పడిపోవడంతో ఆసియాలోనే రెండో అతిపెద్ద బెల్లం మార్కెట్‌గా పేరొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్‌ కళ తప్పింది. ఒకప్పుడు కళకళలాడిన మార్కెట్‌ యార్డ్‌ నేడు వెలవెలబోతోందని రైతులు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల్లో లక్ష ఎకరాలకు పైగా సాగైన చెరకు పంట... ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో కేవలం 2 వేల హెక్టార్లకు పరిమితమైందని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. దీంతో బెల్లం వ్యాపారం గణనీయంగా తగ్గిపోయింది.

నాలుగు ఫ్యాక్టరీలు మూత...

ఒకప్పుడు అనకాపల్లి, తుమ్మపాల, చోడవరం, మార్టూరు ప్రాంతాల్లో సందడి చేసిన నాలుగు చక్కెర ఫ్యాక్టరీలు వరుసగా మూతపడటం చెరకు రైతులకు పెద్ద దెబ్బ అయింది. గన్ను క్రష్ చేసేందుకు గతంలో మాదిరిగా ఫ్యాక్టరీలు లేకపోవడంతో రైతులు బెల్లం తయారీపైనే ఆధారపడాల్సి వస్తోంది.దీనికి తోడు ఎర్రతెగులు, దుబ్బు తెగులు వంటి పంట తెగుళ్లు, పెట్టుబడి వ్యయం పెరగడం, కూలీల కొరత, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో రైతులు చెరకుకు దూరమవుతున్నారు. ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, వరి, అరటి, కొబ్బరి వంటి పంటల వైపు మళ్లుతున్నారు.

బెల్లం మార్కెట్‌ వెలవెల...

దేశంలోనే ప్రసిద్ధి చెందిన అనకాపల్లి బెల్లానికి ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో విశేష డిమాండ్ ఉండేది. రోజుకు వేలాది బెల్లం అచ్చులు లారీల కొద్దీ ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లేవి. కానీ ప్రస్తుతం సాగు తగ్గడంతో మార్కెట్‌కు సరుకు రాక తగ్గింది. దీంతో బెల్లం తయారీ కార్మికులు, హమాలీలు, లారీ యజమానులు, వ్యాపారులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు.

"మా తాతల కాలం నుంచి చెరకు వేస్తున్నాం. ఎకరాకు రూ.లక్ష పైగా ఖర్చవుతోంది. ఫ్యాక్టరీలు లేవు, రేటు లేదు. తెగుళ్లతో పంట ఎండిపోతోంది. ప్రభుత్వం ఆదుకోకపోతే చెరకు పంటే కనుమరుగవుతుంది" - అని రైతులు వాపోతున్నారు.

చెరకు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, నూతన వంగడాలను అందించాలని, తెగుళ్ల నివారణకు చర్యలు తీసుకోవాలని, మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలని, బెల్లం మార్కెట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని అన్నదాతలు కోరుతున్నారు.

క్రైమ్ ఎనాలసిస్ అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ శ్రీనివాసరావు అప్పికొండ

Breaking News

Subscribe our Newsletter