యలమంచిలి నియోజకవర్గం నారాయణపురం కమ్యూనిటీ హాల్‌లో మంగళవారం వైసీపీ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, కొరసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వేలాది మంది కార్యకర్తల సమక్షంలో ‘జై జగనన్న’ నినాదాలతో సమావేశ ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా నేతలు ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తూ, పార్టీ శ్రేణులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.
టీడీపీ ప్రకటించిన ఆరు హామీలను తుంగలో తొక్కిందని కొరసాల కన్నబాబు విమర్శించారు. కనిగిరికొండ పరిరక్షణ కోసం వైసీపీ చేసిన పోరాటం ఫలితంగానే ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడిందని పెట్ల గణేష్ పేర్కొన్నారు.
రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని, పార్టీ విజయానికి పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని వైసీపీ నేతలు పిలుపునిచ్చారు.