పెనుగోలు–ధర్మవరం నుంచి ఎస్.రాయవరం రోడ్డు విస్తరణకు నోచుకునేదెప్పుడు..?
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ (స్పెషల్ రిపోర్టర్ )
దశాబ్దాలుగా నాయకుల హామీలకే పరిమితమైన రహదారి.. చీకటి పడితే ప్రయాణం ప్రాణసంకటమే! వరహానది సమీపం, ఎస్.రాయవరం:
జాతీయ రహదారి–5 (ఎన్‌హెచ్–5)ను ఆనుకుని ఉన్న పెనుగోలు–ధర్మవరం నుంచి ఎస్.రాయవరం వైపు వెళ్లే రహదారి సవాల్‌గా మారిందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా నాయకులు హామీలు ఇవ్వడం, ప్రజల్లో ఆశలు రేకెత్తించడం తప్ప.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యను మరిచిపోవడం పరిపాటిగా మారిందని వారు ఆరోపిస్తున్నారు.
విచిత్రం ఏమిటంటే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సాక్షాత్తు రాష్ట్ర హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ దిగువ ప్రాంత ప్రజలు సరైన రహదారి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు అంటున్నారు. అంతేకాకుండా ప్రముఖ కవి గురజాడ అప్పారావు జన్మస్థలమైన ఎస్.రాయవరంకు వెళ్లే ప్రధాన రహదారి సైతం ఇప్పటివరకు పూర్తిస్థాయి విస్తరణకు నోచుకోకపోవడం దురదృష్టకరమని వారు పేర్కొంటున్నారు.
చీకటి పడితే.. ఏ బండి ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి
సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ మార్గంలో వాహనాల రాకపోకలు అత్యంత ఇబ్బందికరంగా మారాయి. రహదారి పరిస్థితి కారణంగా చీకటి పడిన తర్వాత ఏ వాహనం రోడ్డుపై వెళ్తుందో, ఏ వాహనం పక్కకు జారుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంటోందని ప్రయాణికులు చెబుతున్నారు. రోడ్డు పక్కన పొలాలు, ఇతర ప్రాంతాలు ఉండటంతో చిన్నపాటి తప్పిదం జరిగినా ప్రమాదానికి దారితీసే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మత్స్యకారులు, కొబ్బరికాయల వ్యాపారులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇలా అనేక వర్గాల ప్రజలకు ఈ రహదారి అత్యంత కీలకమైన రహదారిగా ఉంది. కేవలం సుమారు మూడున్నర కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారి సక్రమంగా లేకపోవడంతో సంవత్సరాల తరబడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని పలువురు పేర్కొన్నారు.
28 గ్రామాలకు ప్రధాన రహదారి
ఎస్.రాయవరం మండల కేంద్రం కావడంతో సుమారు 28 గ్రామాల ప్రజలు నిత్యం వివిధ అవసరాల కోసం ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం (ఎంపీడీఓ), తహసీల్దార్ కార్యాలయం (ఎంఆర్‌ఓ), పీడబ్ల్యూడీ కార్యాలయం తదితర ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ ఉండటంతో ప్రతిరోజూ వేలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తుంటాయని స్థానికులు తెలిపారు.
ఇంతటి ప్రాధాన్యత కలిగిన రహదారి విస్తరణకు నోచుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు. రోడ్డు వెడల్పు చేస్తామని నాయకులు పర్యటనలకు వచ్చిన సందర్భాల్లో హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ఆ హామీలను మరిచిపోవడం ఏళ్లుగా జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నో ప్రమాదాలు జరిగినా.. స్పందన ఏది?
ఈ రహదారిపై అనేక వాహన ప్రమాదాలు జరిగినప్పటికీ ఇప్పటివరకు పాలకులు, అధికారులు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పెనుగోలు–ధర్మవరం నుంచి ఎస్.రాయవరం వరకు ఉన్న సుమారు మూడు నుంచి మూడున్నర కిలోమీటర్ల రహదారిని అత్యవసరంగా విస్తరించి, అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించి రహదారి విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని, ప్రజలకు సురక్షితమైన రాకపోకల సౌకర్యం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.