మానవత్వం చాటుకున్న నర్సీపట్నం రూరల్ పోలీసులు:

మానవత్వం చాటుకున్న నర్సీపట్నం రూరల్ పోలీసులు:

15/August/2026 20:03    Share:   

కదిరిలో తప్పిపోయిన మహిళను సురక్షితంగా కుటుంబానికి అప్పగించిన ఎస్.ఐ పి.రాజారావు ​15 రోజులుగా ఆచూకీ లేని బాధితురాలికి వైద్యం అందించి, సత్యసాయి జిల్లా పోలీసుల సమన్వయంతో అప్పగింత స్పందించిన ఉన్నతాధికారులు; రూరల్ పోలీసులకు అభినందనలు 
నర్సీపట్నం (ఆగస్టు 15): "ప్రజల భద్రతే మా బాధ్యత... సేవ చేయడమే మా కర్తవ్యం" అని నర్సీపట్నం రూరల్ పోలీసులు మరోసారి నిరూపించారు. పాక్షికంగా మతిస్థిమితం లేక, అనారోగ్యంతో దారి తప్పి వచ్చిన ఒక యువతికి పునర్జన్మ నిచ్చి, సురక్షితంగా ఆమె కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు.
ఘటన వివరాలు: 
ఈ నెల 12వ తేదీ సాయంత్రం నర్సీపట్నం మండలం, గబ్బాడ గ్రామ శివారు ప్రాంతంలో సుమారు 27 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ అనారోగ్యంతో, తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితిలో తిరుగుతున్నట్లు స్థానికుల ద్వారా నర్సీపట్నం రూరల్ పోలీసులకు సమాచారం అందింది. 
సమాచారం అందిన వెంటనే స్పందించిన రూరల్ ఎస్.ఐ పి.రాజారావు గారు తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని, సదరు మహిళను సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.​ఆమెను విచారించగా కేవలం తన పేరు భార్గవి అని, స్వస్థలం సత్యసాయి జిల్లాలోని 'కదిరి' అని మాత్రమే చెప్పగలిగింది. ఆమె శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్.ఐ పి.రాజారావు గారు వెంటనే స్టేషన్ మహిళా సిబ్బంది సహాయంతో ఆమెను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్య చికిత్స అందించారు. 
గత 15 రోజులుగా ఇంటి నుంచి కనిపించకుండా పోయిన కదిరి పట్టణానికి చెందిన చింతలపల్లి సాయి భార్గవి (27) సమాచారాన్ని సేకరించేందుకు నర్సీపట్నం పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. సత్యసాయి జిల్లా కదిరి పోలీసులతో సమన్వయం చేసుకుని, ఆమె కుటుంబ సభ్యుల ఆచూకీ కనుగొన్నారు.​గత 3 రోజులుగా ఆసుపత్రిలో ఉంచి వైద్య సేవలు అందించిన అనంతరం, పూర్తిగా కోలుకున్న భార్గవిని శనివారం (15.08.2026న) ఆమె తల్లి చింతలపల్లి లక్ష్మికి పోలీసులు సురక్షితంగా అప్పగించారు. కంటికి రెప్పలా కాపాడి తమ బిడ్డను అప్పగించిన నర్సీపట్నం రూరల్ పోలీసులకు ఆమె తల్లి మరియు కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకుని కృతజ్ఞతలు తెలిపారు.​సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక ప్రాణాన్ని కాపాడి, బాధ్యతాయుతంగా వ్యవహరించిన నర్సీపట్నం రూరల్ ఎస్.ఐ పి.రాజారావు మరియు సిబ్బందిని జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
Breaking News

Subscribe our Newsletter