కృష్ణా డెల్టాకు సాగునీరు అందించకపోవడంపై అన్నదాతల ఆగ్రహం..

కృష్ణా డెల్టాకు సాగునీరు అందించకపోవడంపై అన్నదాతల ఆగ్రహం..

15/August/2026 19:54    Share:   

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరులో కృష్ణా డెల్టా రైతుల రాస్తారోకో..
సాగునీరు విడుదల చేయకపోవడంపై వరి నారుతో రైతులు నిరసన..
భూములు బీళ్ళు - కృష్ణా డెల్టా రైతులకు కన్నీళ్లు..
ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించాలి. 
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్..

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు

కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ లో శుక్రవారం సాగునీటి కోసం రాస్తారోకో  చేపట్టారు. ముందుగా వరి నారుతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించాలని, పంటల సాగుకు అవకాశం కల్పించాలని, రైతాంగాన్ని ఆదుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా పరిధిలో ఏలూరు, పెదపాడు, దెందులూరు మండలాల్లోని 58వేల ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టుకు గోదావరి జలాలు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం,ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత 20 రోజులుగా రైతులు రోడ్లెక్కి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఎకరాకు రూ.10 వేలు నుండి రూ.15 వరకు అప్పులు చేసి వరి నారుమళ్ళు, కొన్ని చోట్ల నాట్లు వేసారని చెప్పారు. అత్యధిక మంది సాగుదారులు కౌలు రైతులు, పేద రైతులేనన్నారు. కృష్ణా డెల్టాకు సాగునీరు ఇవ్వకపోతే రైతాంగం తీవ్రంగా  నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో గోదావరి నీళ్లను తేలప్రోలు వరకు కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లను అందించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. పట్టిసీమ నీళ్లను కృష్ణా డెల్టాకు ఇస్తున్నామని ముఖ్యమంత్రి సైతం ప్రకటిస్తున్నారని,కె.ఈ కెనాల్ కు నీరు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.పోణంగి పుంత కాలువ ద్వారా ఏలూరు మండలం పరిధిలోని 10 వేల ఎకరాల కృష్ణా ఆయకట్టుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. గోదావరి కాలువపై ఏలూరు తూర్పు లాకులు వద్ద  మోటార్లు పెట్టి నీరు తోడి సాగునీరు అందించాలని కోరారు. రైతులు, కౌలు రైతులు వేసిన వరి నారుమళ్ళు, నాట్లు వేసిన చేలను కాపాడాలని,వరి సాగుకు అవకాశం కల్పించాలన్నారు.గోదావరి, కృష్ణా ప్రధాన కాలువల్లో నీరు పారుదల లేకపోవడం యుద్ధ ప్రాతిపదికన కాలువలు బాగు చేసే పనులు చేయించాలన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా  కృష్ణా డెల్టాకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని కోరారు. సాగునీరు ఇచ్చేవరకు రైతుల పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
 కృష్ణా డెల్టా రైతులకు సీపీఎం మద్దతు
సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు, నగర కార్యదర్శి పి.రవికుమార్ మాట్లాడుతూ సాగునీటి కోసం కృష్ణా డెల్టా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. ప్రజా ప్రతినిధులు,అధికారులు తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.
రాస్తారోకో అనంతరం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న ఇరిగేషన్ ఎస్.ఈ కార్యాలయంలో ఉప పరివేక్షక ఇంజనీర్ పి. ధనుంజయులకు వినతిపత్రం అందజేశారు. 
ఈ కార్యక్రమంలో కృష్ణా డెల్టా రైతులు వాడవల్లి రామారావు, పైడిపాటి భాస్కరరావు, తలారి జయరాజు, చిన్ని పోతురాజు, మారుమూడి సువర్ణ రాజు, పుట్టి దుర్గాప్రసాద్, కొమ్మన సాంబశివరావు, కోన శ్రీనివాసరావు, బి.రాంబాబు,ఎం. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter